మనసెలా వచ్చిందో..

10 Sep, 2020 07:21 IST|Sakshi

పసికందు సజీవ దహనం 

అమ్మ, అమ్మమ్మ కిరాతకం 

ఇడ్లీ తినలేదని ఆడబిడ్డను కొట్టి చంపిన పెద్దమ్మ 

ఆర్థిక భారంతో రూ.80 వేలకు నెలబిడ్డ విక్రయం 

సాక్షి, చెన్నై : వారు మనుషులమనే విషయాన్ని మరిచిపోయారు. రాక్షసంగా ప్రవర్తించారు. అక్రమ సంతానమని వద్దని అమ్మ, అమ్మమ్మ కలిసి పుట్టిన నాలుగు రోజుల బిడ్డను సజీవ దహనం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఇడ్లీ తినలేదన్న ఆగ్రహంతో ఆడ బిడ్డను పెద్దమ్మ కర్రతో కొట్టి చంపేసింది. పోలీసుల కథనం మేరకు.. తెన్‌కాశి జిల్లా శంకరన్‌ కోయిల్‌ రైల్వే కాలనీ సమీపంలో వేకువ జామున మృతదేహం కాలుతున్న వాసన రావడాన్ని వాకింగ్‌ వెళ్లిన వారు గుర్తించారు. దగ్గరకు వెళ్లి చూడగా ఓ పసికందు అగ్నికి ఆహుతి అవుతుండడంతో మంటల్ని ఆర్పే యత్నం చేశారు. అప్పటికే ఆ శిశువు మరణించింది. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ మంగై కరసి బృందం అక్కడికి చేరుకుని విచారించగా మగబిడ్డగా తేలింది. పసికందును సజీవ దహనం చేసిన వారి కోసం వేట మొదలెట్టారు. ఎస్పీ సుగుణాసింగ్‌ సైతం రంగంలోకి దిగారు. విచారణలో రైల్వే కాలనీ ఆరో వీధికి చెందిన శంకర గోమతి, ఆమె తల్లి ఇంద్రాణి ఈ కిరాతకానికి పాల్పడినట్టు తేలింది. వివాహం కాకుండానే ఓ వ్యక్తి ద్వారా శంకర గోమతి గర్భవతి అయింది. ఆబార్షన్‌కు యత్నించినా, సమయం మించడంతో గత్యంతరం లేక బిడ్డను కనాల్సి వచ్చింది. ఈ విషయం బయటకు రాకుండా తల్లి, కుమార్తె జాగ్రత్త పడ్డారు. బిడ్డ పుట్టిన నాలుగో రోజున ఈ అక్రమ సంతానం తమకు వద్దు అని ఈ కిరాతకానికి ఒడిగినట్టు విచారణలో తేలింది. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి:  విశాఖలో విషాదం, కుటుంబం ఆత్మహత్య)

ఇడ్లీ తినలేదని.. 
కళ్లకురిచ్చి జిల్లా త్యాగుదుర్గానికి చెందిన రోశి భార్య జయరాణి ఇటీవల మరణించింది. దీంతో రోశి రెండో వివాహం చేసుకున్నాడు. తన కుమార్తె ప్రిన్సీమేరి(5)ని జయరాణి తల్లి పచ్చయమ్మాల్‌ ఇంట్లో వదలి పెట్టాడు. పచ్చయమ్మాల్‌తో పాటు పెద్ద కుమార్తె ఆరోగ్య మేరీ ఆ ఇంట్లో ఉంది. బుధవారం పచ్చయమ్మాల్‌ పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఇంట్లో ఆరోగ్య మేరి, ప్రిన్సీ ఉన్నారు. ఇడ్లీ తినేందుకు ప్రిన్సీ మారాం చేయడంతో పెద్దమ్మ ఆరోగ్య మేరీ ఆగ్రహానికి లోనైంది. ఆ బిడ్డను ఇంట్లో ఉన్న దుడ్డుకర్రతో కొట్టింది. తీవ్రంగా గాయపడిన బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిశీలించిన వైద్యులు బాలిక అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆరోగ్యమేరీని అరెస్టు చేశారు. 

బిడ్డ విక్రయం 
కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి అరగల కురిచ్చికి చెందిన మురుగవేల్, హేమలత దంపతులకు ముగ్గురు పిల్లలు. గత నెలాఖరులో మరో బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. కరోనాతో పనులు లేక పోషణ కష్టంగా మారింది. దీంతో పుట్టిన బిడ్డను తమ బంధువు పులియంకండ్రిగకు చెందిన ఫలినో ద్వారా కోయంబత్తూరుకు చెందిన రాజశేఖర్, కోకిల దంపతులకు రూ.80 వేలకు విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న శిశుసంక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆ బిడ్డను విక్రయించిన తల్లిదండ్రుల్ని, కొనుగోలు చేసిన వారిని, మధ్యవర్తిని బుధవారం అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, చెన్నై తిరువొత్తియూరులో పైఅంతస్తులో ఆడుకుంటున్న లారీ డ్రైవర్‌ సుకుమార్‌ కుమారుడు సురేష్‌ కింద పడ్డాడు. చాలాసేపు ఎవరూ పట్టించుకోలేదు. ఎట్టకేలకు స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.  

మరిన్ని వార్తలు