వీడియో: బిడ్డ జోలికి రాబోతే.. ఊరుకుంటుందా? నరకం చూపెట్టి ఉరికించింది

15 Apr, 2023 16:34 IST|Sakshi

Elephant Viral Video: ప్రాణకోటిలో తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. ప్రశాంతతకు మారుపేరైన ఏనుగులు తమ గున్నేనుగుల్ని ఎంత భద్రంగా చూసుకుంటాయో.. వాటికి ఆపద ఎదురైనా, ఎదురవుతుందని తెలిసినా పట్టరాని ఆవేశం ప్రదర్శిస్తుంటాయి. ఎంతదాకా అయినా వెళ్తుంటాయి. తాజాగా.. అలాంటి ఓ వీడియో వైరల్‌ అవుతోంది. 

తల్లి పక్కనే ఉందనే భరోసాతో ఓ చిన్న నీటి మడుగులో గున్నేనుగు సేదతీరి ఉంటుంది. పక్కనే తల్లి ఏనుగు నీటిని జల్లుకుంటూ వేసవి తాపం చల్లార్చుకుంటుంది. ఇంతలో ఆ మడుగులో దాగి ఉన్న ఆపదను గుర్తించింది ఆ ఏనుగు. మొసలి ఒక్కసారిగా తల పైకెత్తడంతో.. వేగంగా స్పందించి కాలితో కసాబిసా మొసలిని తొక్కిపడేసింది. తల్లి చాటున భద్రత ఎరిగిన ఆ బిడ్డ.. అమ్మ పొత్తిళ్లలోకి చేరిపోయింది. నీళ్లలో ఉంటే ప్రాణం పోతుందనుకుందో ఏమో.. మొసలి బయటకు వచ్చి అపసోపాలు పడుతూ అక్కడి నుంచి పరారైంది.  

సోషల్‌ మీడియాలో నిత్యం ఈ తరహా వీడియోలు పోస్ట్‌ చేసే ఐఎఫ్‌ఎస్‌ సుశాంత నందా ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  ‘ఏనుగులు తమ బిడ్డలను రక్షించుకోవడంలో ఏ మేరకు ముందుకు వెళతాయన్నది మనసును కదిలించేది. ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. మొసలి లొంగిపోవలసి వచ్చింది’ అంటూ సందేశం ఉంచారాయన. ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదుగానీ ఆ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని వార్తలు