టెన్త్‌లో కూతురికి 100శాతం మార్కులొచ్చాయని బాధపడుతున్న తల్లి!

25 Jul, 2022 10:52 IST|Sakshi

చండీగఢ్‌: తమ పిల్లలు ఫస్ట్‌ క్లాస్‌లో పాసైతేనే తల్లిదండ్రులు సంతోషంలో అందరికీ చెప్పుకుంటారు. అలాంటిది 100 శాతం మార్కులు సాధిస్తే ఎగిరి గంతేస్తారు. తమ పిల్లల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ, ఓ తల్లి తన కూతురికి పదో తరగతిలో 100 శాతం మార్కులు వచ్చాయని బాధపడుతున్నారు. ఆమె బాధకు గల కారణాలేంటి?

హర్యానాకు చెందిన అంజలి యాదవ్‌ అనే విద్యార్థిని ఇటీవల సీబీఎస్‌ఈ ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల‍్లో 100 శాతం మార్కులు సాధించింది. కానీ, ఆమె తల్లి మాత్రం ఓ పక్క సంతోషంగా ఉన్నా.. మరోవైపు బాధపడుతున్నారు. తన కుమారఢ్‌ను పైచదువులకు ఏ విధంగా పంపించాలో తెలియటం లేదని తనలోతానే మదనపుడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కడాని కుటుంబం వారిది. దీంతో పైచదువులకు అయ్యే ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు. 

విద్యార్థినికి డాక్టర్‌ కావాలనేది కల. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌లో చదవాలనుకుంటోంది. కానీ, వారి కుటుంబంలో తల్లి పని చేస్తేనే పూట గడిచే పరిస్థితులు ఉన్నాయి. వారికి కొద్ది పాటి వ్యవసాయ భూమి ఉన్నా.. అందులో పండేవి ఇంటికే సరిపోవు. విద్యార్థిని తండ్రి పారామిలిటరీలో చేరిన క్రమంలో 2010లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనారోగ్య సమస్యలతో 2017లో తన విధుల నుంచి వైదొలిగారు. ఆ సమయంలో పీఎఫ్‌ ద్వారా రూ.10 లక్షలు అందాయి. కానీ, అవి అప్పులు, ఇతర ఖర్చులకే అయిపోయాయని వాపోయారు విద్యార్థిని తల్లి ఊర్మిళ. విద్యార్థిని సోదరుడు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. సిలార్పుర్‌లో నివాసం ఉంటున్న విద్యార్థిని అంజలి.. మహోందర్‌గఢ్‌లోని ఇండస్‌ వాలీ పబ్లిక్‌ స్కూల్‌లో చదవుతోంది. ‘ఆమె కష్టపడి చదువుతుంది. తాను అనుకున్నది సాధిస్తే మన కష్టాలు తొలగిపోతాయని చెబుతుంటుంది. ఆమెకు ఎప్పుడూ మద్దతు ఇస్తూ చదువుపై దృష్టి పెట్టాలని చెప్పేదాన్ని. ’ అని పేర్కొన్నారు ఊర్మిళ. 

నెలకి రూ.20వేల స్కాలర్‌షిప్‌.. 
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ ఆదివారం ఫోన్‌ చేసి విద్యార్థినిని అభినందించారు. ఈ క్రమంలో తన కుటుంబ పరిస్థితుల గురించి సీఎంకు వివరించింది విద్యార్థిని. దీంతో ఆమెకు నెలకు రూ.20వేల స్కాలర్‌షిప్‌ ‍ప్రకటించారు ముఖ్యమంత్రి. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.   ‘ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించటమే గగనంగా మారింది. అందుకే మా పరిస్థితులపై ముఖ్యమంత్రికి తెలియజేశాను. స్కాలర్‌షిప్‌ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ’ అని విద్యార్థిని తల్లి ఊర్మిళ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’

మరిన్ని వార్తలు