ప్రధాని వస్తేనే టీకా తీసుకుంటా

27 Sep, 2021 07:49 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో మొండికేసిన గిరిజనుడు 

ధార్‌: దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. నిత్యం లక్షలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలోనే టీకా వేయించుకుంటానని ఓ గిరిజనుడు మొండికేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధానమంత్రి ఇప్పుడు రావడం సాధ్యం కాదని, టీకా వేయించుకోవాలని అధికారులు చాలాసేపు ప్రాథేయపడినా అతడు ఒప్పుకోకపోవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ధార్‌ జిల్లాలోని కికార్వస్‌ అనే గిరిజన గ్రామంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అసలేం జరిగింది? 
జిల్లా కేంద్రమైన ధార్‌కు 130 కిలోమీటర్ల దూరంలోని కికార్వస్‌కు వ్యాక్సినేషన్‌ బృందం చేరుకుంది. గ్రామంలో 18 ఏళ్లు దాటిన వారికి కరోనా టీకాలు వేయడం ప్రారంభించింది. ఓ గిరిజనుడికి టీకా వేసేందుకు ప్రయత్నించగా నిరాకరించాడు. ప్రభుత్వ ఉన్నతాధికారులను పిలిపించాలని పట్టుబట్టాడు. సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌(ఎస్‌డీఎం)ను పిలిపించాలా? అని అడగ్గా.. కాదు, సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావాల్సిందేనని తేల్చిచెప్పాడు.  చదవండి: (వ్యాక్సిన్‌ ఒక సురక్ష చక్రం)

మోదీ వస్తే ఆయన సమక్షంలోనే టీకా తీసుకుంటానని స్పష్టం చేశాడు. ఇంతలో గ్రామంలో అర్హులకు టీకా వేయడం పూర్తయ్యింది. గిరిజనుడు, అతడి భార్య మాత్రమే మిగిలారు. టీకా తీసుకొనేందుకు వారు నిరాకరిస్తుండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తల పట్టుకున్నారు. మరోసారి గిరిజనుడి వద్దకు వెళ్లి ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అధికారులు ఇంటింటికీ తిరిగి అర్హులకు కరోనా టీకా వేస్తున్నారు.   

>
మరిన్ని వార్తలు