ప్రభుత్వం ఎంపిక చేసిన దృశ్యాలపై ఎంపీ బినోయ్‌ విశ్వమ్‌ లేఖ

15 Aug, 2021 07:49 IST|Sakshi

ఆగస్టు 11 ఘటన పూర్తి వీడియో బయట పెట్టండి 

రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు సీపీఐ ఎంపీ లేఖ 

న్యూఢిల్లీ: ఆగస్టు 11న రాజస్యభలో జరిగిన రభకు సంబంధించి ప్రభుత్వం ఎంపిక చేసిన దృశ్యాలను మాత్రమే లీక్‌ చేసి ప్రతిపక్షాలపై తప్పుడు అభిప్రాయాలను కలిగించవద్దంటూ సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వమ్‌ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని అన్నారు. సభలోని ప్రతిపక్ష సభ్యులపై గుర్తు తెలియని సైనికులు దాడి చేశారని ఆయన ఆరోపించారు.

ఆగస్టు 11కు సంబంధించి పూర్తి సీసీటీవీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రజా వ్యతిరేకమైన జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (నేషనలైజేషన్‌) అమెండమెంట్‌ బిల్, 2021ని సెలక్ట్‌ కమిటీ పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయన్నారు. అయితే అప్పుడే దాదాపు 40 మంది గుర్తు తెలియని సైనికులు సభలో ప్రవేశించారన్నారు. మహిళా ఎంపీలు సహా ప్రతిపక్ష సభ్యులపై భౌతిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. అయితే బయటకు వచ్చిన వీడియోలలో మాత్రం సభ్యులు మార్షల్స్‌పై దాడి చేస్తున్నట్లు చూపించారని అన్నారు. తనపై కూడా 4–5 మంది బయటి వ్యక్తులు వచ్చి దాడిచేశారని పేర్కొన్నారు. సభలో జరిగిన అసలు విషయాన్ని దాచి ఎంపిక చేసిన వీడియోను విడుదల చేసిన కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.

చదవండి : సోషల్‌ మీడియాకు ఊరట, చట్టంలోని కొన్ని అంశాలపై బాంబే హైకోర్టు స్టే

మరిన్ని వార్తలు