పాపం!.. ఆ మంత్రి దురదకు తాళలేక నడిరోడ్డు మీద కుర్తా తీసి..

10 Feb, 2023 12:02 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో బీజేపీ వికాస్‌ రథయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే యాత్ర చేస్తున్న మంత్రి​ బ్రజేంద్ర సింగ్‌ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆ యాత్ర ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ మేరకు మంత్రి బ్రజేంద్ర సింగ్‌ అసెంబ్లీ నియోజకవర్గం మంగవోలిలోని ఓ గ్రామం గుండా యాత్రకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దురద పెట్టించే పౌడర్‌ను చల్లాడు. దీంతో ఆ మంత్రికి విపరీతమైన దురద రావడంతో.. నడిరోడ్డుపైనే కుర్తా విప్పే పరిస్థితికి దారితీసింది. ఆ దురదకు తాళలేక మంత్రి నీళ్లతో చేతులను, ముఖాన్ని కడుక్కున్నారు.

అందుకు సంబంధించిన వీడియోని కొందరూ రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మాజీ సర్పంచ్‌ వికాస్‌ యాత్ర అవసరమా అని బ్రిజేంద్ర సింగ్‌ని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అంతేగాదు వీడియోలో..ఈ ప్రాంతంలో మూడు కిలోమీటర్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేయలేకపోయింది. మేము కాంగ్రెస్‌ చెడ్డదనుకున్నాం, కానీ మీరు అంతకంటే అధ్వాన్నంగా ఉన్నారు. మాకు మంచి రహదారులను ఇవ్వండి లేకపోతే మీకు ఓటు వేయం అని ఆ వ్యక్తి ఎమ్మెల్యే ముఖం మీదే అంటున్నట్లు వినిపిస్తుంది.

దీనికి మంత్రి కూడా ఓటు వేయకండి అదీ మీ హక్కు అని అతనికి బుదులిస్తున్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఇలానే రెండు రోజుల క్రితమే ఖండ్వా జిల్లాలోని ఒక గ్రామం గుండా వెళ్తుండగా మరో వికాస్‌ రథ్‌ రోడ్డుపై ఇరుక్కుపోయింది. ఇదిలా ఉండగా, ఈ వికాస్ యాత్రలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది. 

(చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం)

మరిన్ని వార్తలు