హవ్వా.. హనుమంతుడి ముందు ఇలాంటి పనులా?

7 Mar, 2023 09:46 IST|Sakshi

భోపాల్‌: బీజేపీ చేష్టలపై మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా మడిపడుతోంది. హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేసి, ఆ విగ్రహ సమక్షంలోనే మహిళలకు బాడీ బిల్డింగ్‌ పోటీలు ఏర్పాటు చేయించింది బీజేపీ. అయితే అందులో వాళ్ల వస్త్రధారణ బికినీలతో ఉండడంతో.. దేవుడి విగ్రహం ముందు, అదీ అసభ్యతను ప్రొత్సహించడమేంటని కాంగ్రెస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి. 

సోమవారం రత్లాంలో బాడీ బిల్డింగ్‌ జరిగిన వేదికకు వెళ్లి మరీ హనుమాన్‌ విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేశాయి కాంగ్రెస్‌ శ్రేణులు. అనంతరం హనుమాన్‌ చాలీసా పఠించాయి. హనుమంతుడి ముందు ఇలాంటి అసభ్య వేషాలేంటని మండిపడుతున్నారు వాళ్లు. ఈ ఘటనకు కారకులెవరో వాళ్లను హనుమాన్‌ భగవానే కఠినంగా శిక్షిస్తాడని తిట్టిపోస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. మార్చి 4, 5వ తేదీల్లో రత్లాంలో మిస్టర్‌ జూనియర్‌ బాడీబిల్డింగ్‌ పోటీలు జరిగాయి. నిర్వాహక కమిటీలో బీజేపీ మేయర్‌ ప్రహ్లాద్‌ పటేల్‌ ఉండగా.. స్థానిక ప్రజాప్రతినిధి చైతన్య కశ్యప్‌ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు వార్తల్లో, సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. 

అయితే.. కాంగ్రెస్‌ విమర్శలకు బీజేపీ సమాధానం ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీకి మహిళలు క్రీడా రంగంలో రాణించడం ఏమాత్రం ఇష్టం లేదేమో అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హితేజ్‌ బాజ్‌పాయి కౌంటర్‌ ఇచ్చారు. కుస్తీ, జిమ్నాస్టిక్స్‌, ఈతలు.. ఇలా ఏ క్రీడల కేటగిరీలోనూ మహిళలు రాణించాలని కాంగ్రెస్‌ కోరుకోవడం లేదు. మైదానంలోని మహిళలను పాడు కళ్లతోనే చూస్తారు వాళ్లు. అందుకు వాళ్లకు సిగ్గుండాలి అని విమర్శించారు. అంతేకాదు ఈవెంట్‌ నిర్వాహకులు కొందరు వేదికపై గంగా జలం జల్లిన కాంగ్రెస్‌నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మెమొరాండం సమర్పించారు. 

ఇక ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కమల్‌ నాథ్‌ వ్యక్తిగత మీడియా సలహాదారు పీయూష్‌ బాబెలే స్పందించారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమాన్‌ భగవాన్‌ సమక్షంలో.. ఇలాంటి అసభ్యతను ప్రదర్శించడం దారుణమన్నారు. భగవంతుడ్ని అగౌరవపరిచి.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు