అడుక్కోవడానికి వెళ్లాలి.. ఆదివారం సెలవివ్వండి: ఇంజనీర్‌

12 Oct, 2021 11:25 IST|Sakshi
అడుక్కోవాలి.. ఆదివారం సెలవివ్వండి అని కోరిన డిప్యూటి ఇంజనీర్‌ రాజ్‌కుమార్‌ యాదవ్‌

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న లీవ్‌ అప్లికేషన్‌

భోపాల్‌: సాధారణంగా మనకు ఆరోగ్యం బాగాలేకపోతేనే.. లేక వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెడతాం. కానీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఓ లీవ్‌లెటర్‌ని చూస్తే.. ఇదేందిరా భయ్‌ ఇలాంటి వాటికి కూడా సెలవు అడుగుతారా అనిపిస్తుంది. ఆ వెరైటీ లీవ్‌లెటర్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్‌ యాదవ్‌ ఈ వింత లీవ్‌ లెటర్‌ సృష్టికర్త. డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేస్తున్న రాజ్‌కుమార్‌ ఆదివారం నేను భిక్షాటనకు వెళ్లాలి.. దయచేసి నాకు సెలవు మంజూరు చేయమంటూ తన పైఅధికారులను అభ్యర్ధించాడు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న నీవు అడుక్కోవడం ఏంటయ్యా అని రాజ్‌కుమార్‌ను ప్రశ్నించిన ఉన్నతాధికారులు.. అతడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు.
(చదవండి: ‘వీడియో చూస్తుంటే.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి’)

వారిని షాక్‌కు గురి చేసిన ఆ సమాధానం ఏంటంటే.. తనకు గతజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని.. అందుకే భిక్షాటన చేయాలనుకుంటున్నాని తెలిపాడు. అంతేకాక తనలోని అహాన్ని చెరిపివేయడానికి మతపరమైన అన్వేషణ చేస్తూ.. ఆత్మ శోధన చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు రాజ్‌కుమార్‌. 

మరింత ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పూర్వ జన్మలో రాజ్‌కుమార్‌, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దున్‌ ఓవైసీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ముగ్గురు మంచి స్నేహితులట. వీరంతా మహాభారత కాలంలో స్నేహితులుగా ఉండేవారట. ఇక వీరిలో ఓవైసీ పాండవ రాకుమారుడు నకులుడు కాగా మోహన్‌ భగవత్‌ శకుని మామ అట. గత జన్మలో వీరు ఇద్దరు రాజ్‌కుమార్‌ ప్రాణ స్నేహితులట. అంతేకాక ఆదివారం సెలవు పెట్టి భిక్షాటనతో పాటు మరన్ని గత జన్మ స్మృతులను గుర్తుకు తెచ్చుకోవడం కోసం భగవద్గీత పారాయణం కూడా చేయాలని భావిస్తున్నట్లు రాజ్‌ కుమార్‌ తన లేఖలో పేర్కొన్నాడు. 

(చదవండి: ప్రేమికులపై పైశాచికం: మెడలో టైర్లు వేసి..)

ఇక ఈ లేఖ చదివిన రాజ్‌కుమార్‌ ఉన్నతాధికారులు ఇచ్చిన రిప్లై కూడా మరింత ఫన్నీగా ఉంది. జనపద్ పంచాయితీ సీఈఓ పరాగ్ పంథి, “ప్రియమైన డిప్యూటీ ఇంజనీర్, మీరు మీ అహాన్ని చెరిపివేయాలనుకుంటున్నారు, ఇది చాలా సంతోషకరమైన విషయం. మీ లక్ష్యాన్ని సాధించడంలో మా సహకారం మీకు సహాయపడుతుంది. ఈ అహాన్ని దాని మూలాల నుంచి నాశనం చేయడం మీ పురోగతికి ఎంతో అవసరం’’ అని రిప్లై ఇచ్చారు. సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ లీవ్‌ లెటర్‌పై నెటిజనులు ఇలాంటి బిత్తిరి జనాలు మన దగ్గరే ఉంటారు అని కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం

మరిన్ని వార్తలు