జాక్‌పాట్‌: రెండేళ్లలో ఆరుసార్లు వజ్రాల పంట

28 Aug, 2021 21:33 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఒక రైతుకు నిజంగా జాక్‌ పాట్‌ తగిలింది. రైతు భూమిలో అతి విలువైన వజ్రాలు పండుతున్నాయి. వినడానికి కొంచెం అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజం. ఇలా ఒకసారి రెండు సార్లు కాదు రెండేళ్లలో ఏకంగా ఆరుసార్లు జ‌రూర్‌పూర్ అనే గ్రామంలో ప్రకాశ్‌ మజుందార్  అనే రైతుకు  డైమండ్స్‌ రూపంలో అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. 

తాజాగా ప్రకాశ్‌కు 6. 47 క్యారెట్ల బ‌రువు ఉన్న వ‌జ్రం దొరికింది. దీని విలువ సుమారు 30 లక్షల రూపాయ‌లు ఉంటుందని అంచనా. ఇలా రెండేళ్లలో ఆరుసార్లు అధిక నాణ్యత గల వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రభుత్వం నుండి లీజుకు తీసుకున్న భూమిలో వజ్రాలున్నాయని గమనించిన ప్రకాశ్‌ స్నేహితుల సాయంతో తవ్వకాలు చేపట్టాడు. దీంతో మరో డైమండ్‌ను వెలికి తీసాడు. శుక్రవారం జిల్లాలోని జరువాపూర్ గ్రామంలోని గనిలో కనుగొన్నట్లు ఇన్‌ఛార్జ్ వజ్రాల అధికారి నూతన్ జైన్ తెలిపారు. రాబోయే వేలంలో ఈ  6.47 క్యారెట్ల వజ్రాన్ని విక్రయిస్తామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధర నిర్ణయిస్తామని చెప్పారు.

మరోవైపు వేలంలోవచ్చిన సొమ్మును తన నలుగురు భాగస్వాములతో  కలిసి పంచుకుంటానని ప్రకాశ్‌ చెప్పారు. గత సంవత్సరం తనకు 7.44 క్యారెట్ల వజ్రం దొరికిందనీ, గత రెండు సంవత్సరాలలో 2 నుండి 2.5 క్యారెట్ల బరువున్న నాలుగు విలువైన రాళ్లను కూడా   సొంతం చేసుకున్నానని తెలిపారు. 

మరిన్ని వార్తలు