చీతాల మేత కోసం చీతల్.. తీవ్రదుమారం! అధికారులేమన్నారంటే..

21 Sep, 2022 12:15 IST|Sakshi

భోపాల్‌: ప్రాజెక్టు చీతాలో భాగంగా.. నమీబియా నుంచి భారత్‌కు రప్పించిన చీతాల విషయంలో రోజుకో విమర్శ వినిపిస్తోంది. చీతాల రాకతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిసిందే. తాజాగా ఓ ప్రచారం వెలుగులోకి రావడంతో బిష్ణోయ్‌ కమ్యూనిటీ ప్రజలు నిరసనలకు దిగారు.

చీతాల కోసం రాజస్థాన్‌ నుంచి తెప్పించిన చీతల్‌(మచ్చల జింక)లను మధ్యప్రదేశ్‌ కునో నేషనల్‌ పార్క్‌లో వదిలినట్లు ప్రచారం మొదలైంది. దీంతో రాజస్థాన్‌కు చెందిన బిష్ణోయ్‌ తెగ నిరసనలకు దిగింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సైతం లేఖ రాసింది ఆ తెగ. చీతల్‌ అనేది అంతరించిపోయే స్థితిలో ఉన్న జంతుజాలమని, అధికారులు తీసుకున్న అర్థంపర్థం లేని నిర్ణయంపై పునరాలోచన చేయాలని వాళ్లు ప్రధానిని లేఖలో కోరారు. అంతేకాదు.. హర్యానా ఫతేబాద్‌ కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించి.. మినీ సెక్రటేరియెట్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అయితే.. 

మధ్యప్రదేశ్‌ అటవీ శాఖ అధికారులు ఈ వివాదంపై స్పష్టత ఇచ్చారు. రాజస్థాన్‌ నుంచి చీతల్‌ను తెప్పించలేదని, ఎందుకంటే.. అలా తెప్పించాలంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి కునో నేషనల్‌ పార్క్‌లోనే 20వేలకు పైగా చీతల్స్‌ ఉన్నాయని, కాబట్టి, బయటి నుంచి తెప్పించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. 

ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా.. నమీబియా(ఆఫ్రికా దేశం) నుంచి తెప్పించిన ఎనిమిది చీతాలను సెప్టెంబర్‌ 17వ తేదీన గ్వాలియర్‌ కునో నేషనల్‌ పార్క్‌లోకి విడుదల చేశారాయన. ఛత్తీస్‌గఢ్‌(అప్పట్లో మధ్యప్రదేశ్‌) కొరియా జిల్లాలో 1947లో భారత్‌లో చివరి చీతా కన్నుమూసింది. ఆపై 1952 నుంచి చీతాలను అంతరించిన జాబితాలో చేర్చింది భారత్‌.

ఇదీ చదవండి: డివైడర్‌పై పడుకోవడమే వాళ్లు చేసిన పాపం!

మరిన్ని వార్తలు