శారీరక సంబంధం: మధ్యప్రదేశ్‌ బెంచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

15 Aug, 2021 14:09 IST|Sakshi

ప్రేమ-పెళ్లి హామీతో యువతుల మీద అఘాయిత్యాలు జరుగుతున్న తీరుపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లికానీ యువతులు కేవలం సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని, ఈ విషయంలో మగవాళ్లే పర్యవసనాలనెరిగి ప్రవర్తించారని ఇండోర్‌ బెంచ్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది.

‘సంప్రదాయాలకు విలువ ఇచ్చే సమాజం మనది. అలాంటిది పెళ్లి కానీ యువతులు దిగజారి ప్రవర్తించేంతకు స్థితికి ఇంకా చేరుకోలేదు. పెళ్లి చేసుకుంటారని, ఏదో ఒక హమీ మీద తప్పించి.. సరదా కోసం ఇలా శారీరక సంబంధం పెట్టుకోరు. అలాగే నిజాన్ని నిరూపించడానికి ప్రతీసారి బాధితులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా తదుపరి పర్యవసానాలను కూడా గమనించాలి’ అని వ్యాఖ్యానించింది జస్టిస్‌ సుబోధ్‌ అభయంకర్‌ నేతృత్వంలోని బెంచ్‌.
 
కేస్‌ వివరాలు
ఉజ్జయినికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2018 అక్టోబరు నుంచి ఓ యువతితో శారీరకంగా కలిశాడు. అయితే పెద్దలు ఒప్పుకోవట్లేదని,  తాను వేరేవారిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. జూన్‌ 2న ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న ఆమె నుంచి మహకల్‌ స్టేషన్‌ పోలీసులు స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ ఆమె బతికింది. ఇక ఆ యువకునిపై అత్యాచారం కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. బెయిల్‌ కోసం దరఖాస్తు చేయగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌కు చెందిన జస్టిస్‌ సుబోధ్‌ అభయంకర్‌ విచారణ జరిపారు.
 

ఆమెకు 21 ఏళ్లు నిండాయని, ఇష్టప్రకారమే సంబంధం పెట్టుకున్నామంటూ నిందితుడు చేసిన వాదనను అంగీకరించలేదు. వేర్వేరు మతాలే వాళ్ల పెళ్లికి ఆటంకంగా మారిందన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను బెంచ్‌ పరిగణనలోకి తీసుకుంది. దీంతో నిందితుడికి కోర్టు బెయిల్‌ నిరాకరించింది. అంతేకాదు పలు కేసుల ప్రస్తావన తీసుకొచ్చిన బెంచ్‌.. ఇలాంటి వ్యవహారాల్లో కక్కుర్తిపడే మగవాళ్లే, అనుమానితులుగా బయటపడ్డ సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని, బాధితులకు అన్యాయం జరిగిన సందర్భాలే ఉన్నాయంటూ వ్యాఖ్యానించడం విశేషం.

మరిన్ని వార్తలు