ఆమెతో రాఖీ కట్టించుకో, 11 వేలు ఇవ్వు: కోర్టు

3 Aug, 2020 08:19 IST|Sakshi

బెయిలు మంజూరు‌ సందర్భంగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యలు

భోపాల్‌: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు వినూత్న షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నెల 3న రక్షా బంధన్‌ సందర్భంగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె చేత రాఖీ కట్టించుకోవాలని ఆదేశించింది. అంతేగాక పండుగ సందర్భంగా సోదరికి అందజేసే కానుకల కింద రూ. 11 వేలు బహుమతిగా ఇవ్వాలని, ఆమె కొడుకుకు మరో రూ. 5 వేలు అందజేయాలని పేర్కొంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇవన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. (మైనర్‌ అంగీకారంతోనే జరిగి ఉంటుంది.. కాబట్టి)

అదే విధంగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, రసీదులు కోర్టుకు సమర్పించాలని, అయితే తదుపరి విచారణపై ఈ అంశాలు ఎటువంటి ప్రభావం చూపవని స్పష్టం చేసింది. కేవలం బెయిలు పొందేందుకు మాత్రమే ఈ షరతులు వర్తిస్తాయని తెలిపింది. వివరాలు.. ఈ ఏడాది జూన్‌లో సదరు నిందితుడిపై లైంగిక ఆరోపణల కింద కేసు నమోదైంది. పొరుగింట్లో ప్రవేశించి మహిళపై అత్యాచార యత్నం చేసినట్లు ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడు బెయిలు కోసం అర్థించగా జూలై 30న కేసును విచారించిన ఇండోర్‌ ధర్మాసనం రూ. 50 వేల పూచీకత్తు కింద బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా.. ‘‘నిందితుడు తన భార్యతో కలిసి ఆగష్టు 3, 2020న ఉదయం 11 గంటలకు బాధితురాలి ఇంటికి వెళ్లాలి. ఆమె చేత రాఖీ కట్టించుకోవాలి. తనకు అన్ని విధాలుగా రక్షగా ఉంటాననే హామీ ఇవ్వాలి. (ఈ చెత్తనంతా భరించలేం: సుప్రీంకోర్టు)

ఈ సంప్రదాయం ప్రకారం సోదరీమణులకు సోదరులు ఇచ్చే కానుక కింద రూ. 11 వేలు ఇవ్వాలి. ఆమె కొడుకుకు దుస్తులు, స్వీట్లు కొనుగోలు చేసేందుకు మరో రూ. 5 వేలు ఇవ్వాలి. ప్రాణాంతక వైరస్‌ విస్తరిస్తున్నందున కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల  ప్రకారం సామాజిక దూరం, పరిశుభ్రత, మాస్కు ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి’’అని జస్టిస్‌ రోహిత్‌ ఆర్య పేర్కొన్నారు. కాగా ఇటీవల గ్వాలియర్‌ బెంచ్‌ సైతం హత్యాయత్నం చేసిన ఓ వ్యక్తికి వింతైన షరతులతో బెయిలు మంజూరు చేసింది. గ్వాలియర్‌ జిల్లా ఆస్పత్రిలో చైనా వెలుపల తయారు చేసిన ఎల్‌ఈడీ టీవీని పెట్టించాలని ఆదేశించింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా