Wife Cheat Husband: ఆడదే కాదు.. మోసం చేసి అంటగట్టారు: ఇదొక విచిత్రమైన కేసు!

14 Mar, 2022 15:11 IST|Sakshi

పెళ్లయిన కొత్తలోనే భర్తకు భార్య, భార్యకు భర్త షాకిచ్చిన ఉదంతాలు, మోసపోయిన కథనాల గురించి వినే ఉంటారు. అయితే ఇక్కడో భర్త.. భార్య మీద అనూహ్యమైన ఆరోపణలకు దిగాడు. తన భార్య అసలు ఆడదే కాదని.. తనను మోసం చేసి అంటగట్టారంటూ వైద్య నివేదికలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 

తన భార్యకు పురుషాంగం ఉందని.. తనను మోసం చేసి పెళ్లి చేశారంటూ ఓ వ్యక్తి ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌ నేతృత్వంలోని బెంచ్‌ తొలుత ఈ పిటిషన్​ స్వీకరించేందుకు తొలుత నిరాకరించింది. అయితే వైద్య పరీక్షల రిపోర్టులన్నీ పరిశీలించాక.. శుక్రవారం సదరు యువతితో పాటు ఆమె తల్లిదండ్రులకు నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా నోటీసులపై స్పందించాలని ఆదేశించింది.

తొలి రాత్రే షాక్‌..
మధ్యప్రదేశ్​ గ్వాలియర్‌కు చెందిన వ్యక్తికి 2016లో వివాహం జరిగింది. ఆ తర్వాత చాలాకాలం పాటు ఆ అమ్మాయి కార్యానికి సహకరించలేదు. పీరియడ్స్‌, ఆరోగ్యం బాగోలేదంటూ వాయిదా వేస్తూ పోయారు అమ్మాయి తరపు ఇంటివాళ్లు. చాలా కాలం ఓపిక పట్టిన ఆ యువకుడు.. చివరకు తన తల్లిదండ్రులను రంగంలోకి దించి.. ఓ ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. చివరకు ఆ రాత్రి.. భార్యకు పురుషాంగం ఉందంటూ రచ్చ చేశాడు. తాను మోసపోయానని, అమ్మాయిని కాకుండా అబ్బాయిని తనకు కట్టబెట్టారని ఆ రాత్రే పెద్దలను పిలిచి పంచాయితీ పెట్టాడు. 

జెనెటిక్‌ లోపం..
Imperforate Hymen ఇంపర్‌ఫోరేట్‌ హైమన్‌.. ఇదొక జెనెటిక్‌ లోపం. పుట్టుకతో అండాశయాలతో స్త్రీగానే ఉన్నా.. బాహ్యంగా మాత్రం పురుషాంగం చిన్నసైజు పరిమాణంలో ఉంటుందని డాక్టర్లు తెలిపారు.ఆ అమ్మాయికి అదే సమస్య ఉంది. ఇది సర్జరీతో సరి చేయొచ్చు. కానీ, పిల్లలు పుట్టే అవకాశాలు చాలా చాలా తక్కువ!. ఆ యువతిని పరిశీలించిన వైద్యులు ఈ విషయమే ఆమె భర్తకు చెప్పారు. పుట్టుకతో వచ్చిన అడ్రినల్ హైపర్‌ప్లాసియా అనే జన్యుపరమైన రుగ్మతగా వెల్లడించారు.

ఈ విషయం తెలిశాక.. ఆ యువతిని ఆ వ్యక్తి పుట్టింటికి పంపించేశాడు. సర్జరీ చేయించి.. తిరిగి ఆమె భర్త ఇంట్లో దిగబెట్టి వెళ్లాడు ఆమె తండ్రి. అయితే మోసం చేసి వివాహం చేయడం, పిల్లలు పుట్టే అవకాశాలు లేకపోవడంతో విడాకులకు పట్టుబట్టాడు ఆ యువకుడు. దీంతో బెదిరింపులకు దిగింది ఆ యువతి కుటుంబం. ఈ క్రమంలోనే.. సదరు వ్యక్తి స్థానిక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాడు.  విచారణ కొనసాగుతున్న సమయంలో ట్రయల్ కోర్టు సదరు యువతికి నోటీసు జారీ చేసింది. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు మాత్రం.. ఆ వ్యక్తి ఆరోపణలకు తగిన ఆధారల్లేవంటూ కేసును కొట్టేసింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన యువకుడు.. న్యాయం కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో.. భర్త ఆరోపణలపై స్పందించాలంటూ ఆ యువతికి.. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు