భార్యను చంపాలని ఇనుప గేటుకు కరెంట్‌ షాక్‌.. ఊహించని పరిణామంతో పరుగులు

11 Oct, 2022 13:49 IST|Sakshi

ఆ తాగుబోతు భర్తతో రోజూ ఆమెకు గొడవే. ఇక భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అది అవమానంగా భావించి.. ఆమెను ఎలాగైనా చంపాలని ప్లాన్‌ వేశాడు. చివరికి ఆ భర్తకే పెద్ద షాకే తగిలింది. భార్యకు బదులుగా ఆమె తల్లి కన్నుమూసింది. దీంతో ఆ భర్త అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు.

మధ్యప్రదేశ్‌ బేతుల్‌ జిల్లా కోట్వాలి స్టేషన్‌ పరిధిలోని సైఖేదా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిత్యం తాగుతూ ఉండే ఆ భర్త.. రోజూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. భర్తను భరించలేక.. నానా తిట్లు తిట్టి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపం పెంచుకున్న ఆ తాగుబోతు.. అత్తింటికి వెళ్లి మరీ భార్యను చంపాలని అనుకున్నాడు. 

సోమవారం సాయంత్రం అత్తింటికి వెళ్లి.. బయట ఉన్న ఇనుప గేటుకు కరెంట్‌ వైర్లను కనెక్ట్‌ చేశాడు. అయితే భార్య బదులు ఆమె తల్లి వచ్చి గేట్‌ను ముట్టుకుంది. దీంతో కరెంట్‌ షాక్‌తో విలవిలలాడి అక్కడికక్కడే ఆ మహిళ(55) మృతి చెందింది. అది చూసి స్థానికులు కేకలు వేయగా.. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురై ఆ భర్త అక్కడి నుంచి పారిపోయాడు. దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడగా.. పరారీలో ఉన్న తాగుబోతు భర్త గురించి పోలీసులు వెతుకుతున్నారు.

ఇదీ చదవండి: గంజాయికి బానిసైన కొడుకు.. నల్లగొండలో దారుణ హత్య 

మరిన్ని వార్తలు