బెలూన్లు ఊది.. ఒక్క ఊపిరితిత్తితోనే కరోనాను జయించిన నర్సు

13 May, 2021 18:54 IST|Sakshi

భోపాల్‌: భారత్‌లో ఇటీవల కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేసులతో పాటు మరణాలు కూడా విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అధిక భాగం ఊపిరి అందక వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.  మరో పక్క కరోనా వచ్చిందనే భయంతోనే.. కొందరు ఊపిరి ఆడటంలేదనే ఆందోళనతో కూడా కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిన ఘటనల ఉన్నాయి. కానీ ధైర్యం, నమ్మకం ఉంటే కరోనా మనల్ని ఏం చేయలేదని నిరూపించింది ఓ మహిళ.  ఒక్క ఊపిరితిత్తితో తనపై దాడిచేసిన కరోనా వైరస్‌ జయించింది. అది కూడా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి 14 రోజుల్లోనే తరిమేసింది మధ్యప్రదేశ్ కు చెందిన ఓ నర్సు.

కంగారు పడక.. కరోనాను జయించింది
మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫులిత్ పీటర్ టికామ్‌గఢ్ ఆసుపత్రిలో నర్సుగా కొవిడ్ వార్డులో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయ్యింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఊపిరితిత్తులపైనే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఒక్క ఊపిరితిత్తితోనే బతుకుతున్న ప్రఫులిత్ పీటర్ ఏమైపోతుందోనని కుటుంబ సభ్యులు, సన్నిహితులు భయపడిపోయారు. కానీ ప్రపులిత్ మాత్రం కేవలం 14 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి వేగంగా కోలుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

కరోనాను జయించిన ప్రపులిత్ అది తనకు ఎలా సాధ్యమైందో మాట్లాడుతూ.. కరోనా సోకినా నేను భయపడలేదు. ధైర్యం కోల్పోలేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు యోగా, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లు క్రమం తప్పకుండా చేసేదాన్ని. అలాగే ఊపిరితిత్తులకు బూస్టింగ్ ఇవ్వటానికి బెలూన్లు ఊదేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంది. దీనికితోడు తన ధైర్యమే కరోనా మీద విజయం సాధించేలా చేసిందని ప్రఫులిత్ చెప్పుకొచ్చింది. ప్రఫులిత్ పీటర్ చిన్నప్పుడు ఓ ప్రమాదానికి గురైంది. ఆ ‍ప్రమాదంలో ఒక ఊపిరితిత్తి బాగా డ్యామేజ్ కావడంతో ఆపరేషన్ చేసి ఒకదాన్ని తొలగించాలని చెప్పారు. వేరే దారి లేక కుటుంబ సభ్యుల అనుమతితో డాక్టర్లు ఒక ఊపిరితిత్తిని తొలగించారు. అప్పటి నుంచి ప్రపులిత్ ఒక్క ఊపిరితిత్తితోనే జీవిస్తోంది.

( చదవండి: విషాదం: రోజు వ్యవధిలో కడుపులో బిడ్డ, డాక్టర్‌ మృతి )

>
మరిన్ని వార్తలు