Genda Bai Found Diamond: కట్టెల కోసం అడవికి వెళ్తే.. రూ. 20 లక్షల డైమండ్‌ దొరికింది

29 Jul, 2022 10:47 IST|Sakshi

భోపాల్‌: అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. ఎంతో మంది ఎన్నో ఏళ్లు కష్టపడ్డా కంటపడని అదృష్టం.. ఆమెకు అనుకోకుండా కలిసొచ్చింది. రాత్రికి రాత్రే ఆమె నసీబ్‌ను మార్చేసింది. కట్టెల కోసం వెళ్లిన ఓ పేద గిరిజన మహిళకు.. అక్కడ దొరికిన వస్తువు ఒకటి లక్షాధికారిని చేసేసింది.

మధ్యప్రదేశ్‌ వజ్రాల జోన్‌ అయిన పన్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎప్పటిలాగే  బుధవారం రోజున పొయ్యి కట్టెల కోసం అడవికి బయలుదేరింది జెందా బాయి. అక్కడ ఆమె మట్టిలో కూరుకుపోయి మెరుస్తున్న ఓ రాయి దొరికింది. దానిని ఇంటికి తీసుకొచ్చి భర్తకు చూపించింది. అయితే దాని మెరుపు ఆయనకు అనుమానంగా అనిపించి.. అధికారులను సంప్రదించాడు. వాళ్లు పరీక్షించి అదొక 4.39 క్యారట్‌ వజ్రమని, చెప్పడంతో ఆ భార్యాభర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.    

డైమండ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనుపమ్‌ సింగ్‌.. డైమండ్‌ డిపాజిట్‌ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేశారు. వేలంలో అది ఫలానా ధర దక్కించుకోవడమే తరువాయి. కనీసం దాని విలువ రూ.20 లక్షల దాకా పలకవచ్చని అనుపమ్‌ సింగ్‌ అంటున్నారు. వచ్చేదాంట్లో ప్రభుత్వం తరపున రాయల్టీ, ట్యాక్సుల రూపంలో 12.5 శాతం మినహాంచుకుని.. మిగతాది జెందా బాయి కుటుంబానికి ఇచ్చేస్తారు. 
 
పన్నా జిల్లాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే పురుషోత్తంపూర్‌ గ్రామం.. జెండా బాయి కుటుంబం ఉంటోంది. భర్త కూలీపనులు.. జెందా బాయి రోజూ కట్టెలు కొట్టి అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నడిపించుకుంటున్నారు. ఈ క్రమంలో వజ్రం రూపంలో ఆ పేద కుటుంబానికి అదృష్టం కలిసొచ్చింది. వచ్చిన డబ్బుతో సొంతగా ఒక ఇల్లు కట్టించుకోవడంతో పాటు కూతుళ్ల పెళ్లిలకు కొంత డబ్బును డిపాజిట్‌ చేస్తామని చెప్తున్నారు ఆ భార్యభర్తలు.

మరిన్ని వార్తలు