కేజీఎఫ్​ రాకీభాయ్‌లా ఎదగాలనే.. శివప్రసాద్‌ వరుస హత్యలు

2 Sep, 2022 18:21 IST|Sakshi

కలకలం రేపిన సెక్యూరిటీ గార్డుల వరుస హత్యల ఉదంతాన్ని.. త్వరగతినే చేధించారు మధ్యప్రదేశ్‌ పోలీసులు. కన్నడ సెన్సేషనల్‌ చిత్రం కేజీయఫ్‌ స్ఫూర్తితోనే తాను హత్యలు చేశానని, రాకీ భాయ్‌లా పేరు సంపాదించుకుని గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు నిందితుడు శివ ప్రసాద్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సంచలనం సృష్టించిన ఈ వరుస హత్యల ఉదంతంలో విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూశాయి ఇప్పుడు.

మధ్యప్రదేశ్‌ సాగర్‌ జిల్లా పరిధిలో వరుసగా సెక్యూరిటీ గార్డులు దారుణంగా హత్యకు గురికావడం.. సంచలనం సృష్టించింది. నిద్రిస్తున్న వాళ్లను అతికిరాతకంగా హత్య చేశాడు 19 ఏళ్ల శివ ప్రసాద్‌. కేజీఎఫ్‌ చిత్రంలో లీడ్‌ రోల్‌ రాకీ భాయ్‌ తరహాలో ఫేమస్‌ అయిపోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ హత్యలు చేసినట్లు శివ ప్రసాద్‌ పోలీసుల ముందు వెల్లడించాడు. 

ఎలా దొరికాడంటే.. 
నిక్కరు, షర్టులో ఉన్న హంతకుడు.. ఓ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. మార్పుల్‌ రాడ్‌తో ముందుగా బాధితుడిపై వేటు వేసి.. చనిపోయాడా? లేదా? నిర్ధారించుకుని.. బతికే ఉండంతో బండ రాయితో బాది మరీ చంపడం ఆ వీడియోలో ఉంది. అయితే అంతకు ముందు చంపిన వాళ్లలో ఒకరి సెల్‌ఫోన్‌ను తనతో పాటు తీసుకెళ్లాడు నిందితుడు శివ ప్రసాద్‌. ఈ తరుణంలో ఆ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు శివను ట్రేస్‌ చేసి.. శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. 

రాకీభాయ్‌లా ఎదగాలనే..
కేజీఎఫ్‌ సినిమా స్ఫూర్తితోనే తాను ఈ హత్యలు చేశాడని, అందులో ప్రధాన పాత్ర రాకీ భాయ్‌లా తాను ఎదిగి.. పేరు తెచ్చుకోవాలనే హత్యలు చేశాడని, ఈ క్రమంలో పోలీసులను తర్వాతి లక్ష్యంగా చేసుకున్నట్లు శివ ప్రసాద్‌ ఒప్పుకున్నాడని పోలీస్‌ అధికారి తరుణ్‌ నాయక్‌ వెల్లడించారు. అంతేకాదు.. ఈ హత్యల తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి.. జనాల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాతే పోలీసులను లక్ష్యంగా చేసుకుని తన సత్తా చూపించాలని అనుకున్నాడట.

ఇదిలా ఉంటే.. భోపాల్‌కు 169 కిలోమీటర్ల దూరంలోని సాగర్‌ ఏరియాలో శివ ప్రసాద్‌ వరుసగా నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులను హత్య చేసుకుంటూ పోయాడు. ఆగస్టు 28వ తేదీన సుత్తితో కళ్యాణ్‌ లోధీ అనే సెక్యూరిటీ గార్డును చంపాడు. ఆ మరుసటి రాత్రి శంభు నారాయణ దూబే అనే కాలేజీ సెక్యూరిటీ గార్డును రాయితో కొట్టి చంపేశాడు. ఆ మరుసటి రాత్రి ఓ ఇంటి వాచ్‌మెన్‌ అయిన మంగల్‌ అహిర్‌వర్‌ను చంపేశాడు. ఆపై ఒక్కరోజు గ్యాప్‌తో గురువారం రాత్రి సోను వర్మ అనే సెక్యూరిటీ గార్డును అతను కాపాలా ఉండే మార్బుల్‌ కంపెనీలోనే దారుణంగా హతమార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడం.. బాధితుల సెల్‌ఫోన్‌ వాడడంతో సిగ్నల్‌ ఆధారంగా మరుసటి రోజు ఉదయమే భోపాల్‌లో దొరికిపోయాడు శివ ప్రసాద్‌. అయితే ఇక్కడే మరో ట్విస్ట్‌ బయటపడింది. 

గతంలోనూ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను శివ ప్రసాద్‌ హత్య చేసినట్లు తేలింది. ఈ మే నెలలో ఓవర్‌బ్రిడ్జి పనులు జరుగుతుండగా.. అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డును దారుణంగా చంపేసి.. అతని ముఖంపై ఓ బూట్‌ను ఉంచేసి వెళ్లిపోయాడు. అనంతరం జూన్‌ చివరి వారంలోనూ ఓ హత్య చేశాడు. అప్పటి నుంచి ‘స్టోన్‌ మ్యాన్‌’ భయం మొదలైంది. తాజాగా వరుస హత్యల నేపథ్యంలో హోం మంత్రి నరోత్తం మిశ్రా స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఈ కేసును త్వరగతిన చేధించగలిగారు పోలీసులు. 

అతని దగ్గర దొరికిన ఆధార్‌కార్డ్‌ వివరాల ప్రకారం..శివ ప్రసాద్‌ స్వస్థలం సాగర్‌ జిల్లా కేస్లీ. తల్లిదండ్రులు, ఇతర వివరాలు తెలియరాలేదు. కాకపోతే ఎనిమిదో తరగతి దాకా చదువుకుని.. గోవాలో కొంతకాలం పని చేశాడు. కొంచెం కొంచెం ఇంగ్లీష్‌ కూడా మాట్లాడుతున్నాడు. కేజీఎఫ్‌-2 చిత్రం చూశాక.. ఆ చిత్రంలో రాఖీలా తాను ఎదగాలనే ఉద్దేశంతో ఇలా చేశాడట. అంతకు ముందు హంతకుడి స్కెచ్‌ను విడుదల చేసిన పోలీసులు.. 30వేల రూపాయల రివార్డు ప్రకటించారు. నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడనే దానిపై మాత్రం నిందితుడు నోరు మెదపడం లేదని తెలుస్తోంది.

ఇదీ చదవండి: నాన్నా.. వాడు అమ్మను రైలు నుంచి తోసేశాడు

మరిన్ని వార్తలు