ఓ తల్లి సాహసం: ఒట్టి చేతులతో చిరుతతో పోరాడి

4 Dec, 2021 21:22 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న సంఘటన

ఒట్టి చేతులతో చిరుతతో పోరాడి బిడ్డ ప్రాణాలు కాపాడుకున్న తల్లి

MP Tribal Woman Fights Leopard With Bare Hands Rescue Her Son: అమ్మ అంటేనే అంతులేని ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం. తనకు ఏం జరిగినా పట్టించుకోదు కానీ బిడ్డకు ఆపద అని తెలిస్తే.. ఆ తల్లి ప్రాణం తల్లడిల్లుతుంది. ఎక్కడా లేని ధైర్యం ఆవహిస్తుంది. ఆది పరాశక్తికి ప్రతిరూపంగా మారి.. ఆపదతో పోరాడుతుంది. ఆ సమయంలో తల్లికి ఎలాంటి ఆయుధాలు అవసరం లేవు.. బిడ్డ మీద ప్రేమ ఒక్కటే ఆమెకు వెయ్యి ఏనుగులు బలాన్ని ఇచ్చి.. పోరాడేలా చేస్తుంది.

ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. చంటి బిడ్డను నోట కరుచుకుని.. అడవిలోకి పారిపోయింది చిరుత పులి. బిడ్డ ప్రాణాలు కాపాడటం కోసం ఆ తల్లి పెద్ద యుద్ధమే చేసింది. తన చేతులనే ఆయుధాలుగా మార్చి.. చిరుతతో పోరాడి.. బిడ్డ ప్రాణాలు కాపాడుకుంది ఆ తల్లి. ఆ వివరాలు.. 
(చదవండి: దేశంలోనే తొలిసారి కనిపించిన అరుదైన ‘గులాబీ’ చిరుత)

మధ్యప్రదేశ్‌, సిధి జిల్లాలోని సంజయ్ టైగర్ జోన్‌లోని ఝరియా అనే గ్రామంలో శంకర్ బైగా, కిరణ్ బైగా తమ పిల్లలతో జీవిస్తున్నారు. ఓ రోజు సాయంత్రం కిరణ్ బైగా తన పిల్లలతో కలిసి ఆరు బయట ఏర్పాటు చేసిన చలి మంట దగ్గర కూర్చుంది. కిరణ్ ఒడిలో ఓ పాప ఉండగా, మరో ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. ఇంతలో అడవిలో నుంచి వచ్చిన చిరుతపులి ఒక్కసారిగా వీరిపై దాడి చేసి.. కిరణ్ బైగా ఎనిదేళ్ల కొడుకు రాహుల్‌ని నోట కరుచుకుని అడవిలోకి పరిగెత్తింది.

జరిగిన సంఘటనతో కిరణ్‌ బైగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. వెంటనే తేరుకుని మిగిలిన పిల్లలను ఇంట్లో ఉంచి.. రాహుల్‌ని కాపాడుకోవడం కోసం అడవిలోకి పరుగు తీసింది. అప్పటికే చీకటి పడింది. ఎదురుగా ఏం కనిపించడం లేదు. చిరుత బిడ్డను తీసుకుని పొదల్లో దూరింది. ఏం చేయాలో కిరణ్‌బైగాకు పాలు పోలేదు. కానీ తన బిడ్డ ప్రాణం ఆపదలో ఉన్న విషయం ఆమెను వెంటాడింది. 
(చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ మాట్లాడటం లేదని పోలీసులకు ఫిర్యాదు.. కట్‌ చేస్తే)

చేతికి దొరికిన కర్ర తీసుకుని అడవిలో ముందుకు వెళ్లింది. అప్పటికే కిరణ్‌ బైగా ధైర్యాన్ని చూసి చిరుత కాస్త జంకింది. ఈ క్రమంలో ఆమె బిడ్డను వదిలేసింది. వెంటనే కిరణ్‌ అక్కడకు పరిగెత్తి.. బిడ్డను తన పొత్తిళ్లలోకి తీసుకుంది. అంతసేపు కిరణ్‌ బైగాను చూసి జంకిన చిరుత.. ఉన్నట్టుండి ఆమె మీద దాడి చేయసాగింది. వెంటనే అప్రమత్తమైన కిరణ్‌ బైగాను బిడ్డను కాపాడుకుంటూనే.. ఒట్టి చేతలతో చిరుతతో పోరాడసాగింది.

అప్పటికే విషయం తెలుసుకున్న గ్రామస్తులు కిరణ్‌, ఆమె బిడ్డ కోసం వెతుకుతూ.. అడవిలోకి వచ్చారు. జనాలను చూసిన చిరుత అడవిలోకి పరుగు తీసింది. ఈ దాడిలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన ఫారెస్ట్‌ అధికారులు కిరణ్‌బైగా సాహసాన్ని ప్రశంసించి.. తక్షణ సాయం కోసం ఆమెకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. బిడ్డ ప్రాణం కోసం కిరణ్‌ బైగా చేసిన సాహసంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ

మరిన్ని వార్తలు