భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం: సుస్థిరత నుంచి సుస్థిరతకు!

28 Mar, 2023 20:12 IST|Sakshi

17 ఎన్నికల్లో ఏడుసార్లు త్రిశంకు లోక్‌ సభ, పదిసార్లు ఏదో ఒక పార్టీకి మెజారిటీ

లోక్‌ సభకు 18వ ఎన్నికలు ఏడాది దూరంలో ఉండడంతో భారత పార్లమెంటు దిగువసభకు ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలను జనం గుర్తుచేసుకుంటున్నారు. 1952 నుంచి జరిగిన 17 ఎన్నికల్లో మొదటి మూడు సందర్భాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మూడింట రెండు వంతులకు పైగా మెజారిటీ వచ్చింది. భారత తొలి ప్రధాని పండిత జవహర్లాల్‌ నెహ్రూ పాలనలో జరిగిన ఈ ఎలెక్షన్లలో కాంగ్రెస్‌ ఆధిపత్యానికి ఎదురులేని పరిస్థితి నెలకొంది.

1964 మేలో నెహ్రూ జీ మరణానంతరం ముగ్గురు కాంగ్రెస్‌ ప్రధానులు (జీఎల్‌ నందా, లాల్‌ బహదూర్‌ శాస్త్రీ, ఇందిరాగాంధీ) మూడేళ్లు రాజ్యమేలారు. ఇందిరమ్మ పాలనలో 1967లో జరిగిన నాలుగో లోక్‌ సభ ఎన్నికల్లో భారత ఓటర్లు ఆశ్చర్యకర తీర్పు ఇచ్చారు. మొదటి మూడు ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం పొందిన కాంగ్రెస్‌ ఈసారి సాధారణ మెజారిటీ సాధించింది. మొత్తం 523 సీట్లలో కనీస మెజారిటీకి అవసరమైన 262 సీట్లకు గాను కాంగ్రెస్‌ 283 స్థానాలు సంపాదింది. 

1962 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్‌ 78 సీట్లు కోల్పోయింది. ఎన్నికల తర్వాత ఇందిరాగాంధీ రెండోసారి ప్రధాని అయ్యారు. 1969 నవంబర్‌లో కాంగ్రెస్‌ చీలికతో ఆమె మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూ ఏడాది ముందే 1971లో మధ్యంతర ఎన్నికలు జరిపించారు. ఆమె హయాంలో మొదటిసారి కాంగ్రెస్‌ కు మూడింట రెండొంతుల మెజారిటీ (352 సీట్లు) లభించింది. ఇలా కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా ఐదుసార్లు మెజారిటీకి అవసరమైన స్థానాలు లభించాయి.

ఎమర్జెన్సీ కారణంగా ఐదో లోక్‌ సభ ఆరేళ్లు కొనసాగింది. ఆరో పార్లమెంటు ఎన్నికల్లో (1977) కాంగ్రెస్‌ తొలిసారి ఓడిపోయింది. నాలుగైదు పార్టీల విలీనంతో ఏర్పడిన జనతాపార్టీ సంపూర ్ణ మెజారిటీ (295) సాధించింది. జనతా చీలిక అనంతరం మొరార్జీ దేశాయి, చరణ్‌ సింగ్‌ ప్రభుత్వాలు కూలిపోవడంతో ఆరో లోక్‌ సభ మూడేళ్లలోపే రద్దయింది. 1980 జనవరిలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరమ్మ నేతృత్వంలోని కాంగ్రెస్‌ మూడింట రెండొంతుల మెజారిటీతో (353 సీట్లు) అధికారంలోకి వచ్చింది. 1984 చివర్లో ఇందిర హత్యానంతరం ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ హయాంలో 533 సీట్లకు జరిగిన 8వ లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 414 సీట్లతో ఐదింట నాలుగొంతుల మెజారిటీ సంపాదించి రికార్డు సృష్టించింది. 

1989 నుంచి 2009 వరకూ జరిగిన 7 ఎన్నికల్లో హంగ్‌ పార్లమెంటు!
1989లో జరిగిన 9వ లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. అయితే, ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో హంగ్‌ లోక్‌ సభతోనే రెండు మైనారిటీ ప్రభుత్వాలు (వీపీ సింగ్, చంద్రశేఖర్‌ ప్రధానులుగా) నడిచాయి. ఏడాదిన్నర లోపే సభ రద్దవడంతో 1991 మేలో జరిగిన పదో లోక్‌ సభ ఎన్నికల్లో కూడా ఏ పార్టీకీ సాధారణ మెజారిటీ రాలేదు. పీవీ నరసింహారావు గారి నాయకత్వంలోని కాంగ్రెస్‌ మెజారిటీ సాధించలేకపోయినా 244 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

బయట నుంచి కొన్ని మిత్రపక్షాల మద్దతుతో పీవీ ప్రధాని పదవి చేపట్టి ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత పూర్తి పదవీకాలం కొనసాగలేకపోయిన 11, 12, 13వ లోక్‌ సభలు (1996, 98, 99లో) ఏ పార్టీకి మెజారిటీ లేని త్రిశంకు సభలు. 1999లో ఏర్పాటైన 13వ లోక్‌ సభ ఐదేళ్లు పూర్తికావడానికి 8 నెలల ముందు రద్దయింది. వరుసగా 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన 14, 15వ లోక్‌ సభలు కూడా ఏ పార్టీకి మెజారిటీలేని త్రిశంకు సభలేకాని కేంద్ర ప్రభుత్వాలు పూర్తి పదవీకాలం నడిచాయి.

1984 తర్వాత అంటే 30 ఏళ్లకు 2014లో 16వ లోక్‌ సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తొలిసారి మెజారిటీ సీట్లు (282) సాధించింది. మళ్లీ ఐదేళ్లకు 2019లో జరిగిన 17వ లోక్‌ సభ ఎన్నికల్లో కూడా పాలకపక్షం 303 సీట్లతో బలం పెంచుకుంది. పైన వివరించినట్టు 1989 నుంచి 2014 వరకూ లోక్‌ సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. వరుసగా ఏడు త్రిశంకు సభల తర్వాత గత రెండు పార్లమెంటు ఎన్నికల్లో పాలకపక్షానికి సాధారణ మెజారిటీ వచ్చింది. 2024 ఎన్నికల్లో కూడా రాజకీయ సుస్థిరతకు దారితీసే ఫలితాలు ఉంటాయని ఎన్నికల విశ్లేషకులు అంచనావేస్తున్నారు


-విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ సీపీ

మరిన్ని వార్తలు