మగువల విజయం.. అక్కడ జీరో కరోనా

29 Apr, 2021 17:42 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ మహిళల వినూత్న ప్రయత్నం

మహమ్మారిని కట్టడి కోసం కృషి

భోపాల్‌: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ప్రతి రోజు లక్షల కొద్ది కేసులు నమోదవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే.. సెకండ్‌ వేవ్‌లో గ్రామాల్లో కూడా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ గ్రామం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ప్రతి రోజు దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నప్పటికి ఆ గ్రామంలో మాత్రం వైరస్‌ జాడలేదు. ఇదేలా సాధ్యమయ్యిందంటే ఆ గ్రామ మహిళల వల్లే. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వైరస్‌ను తమ గ్రామంలోకి అడుగుపెట్టనివ్వకూడదని ఆ ఊరి మహిళలు నిర్ణయించుకున్నారు. వ్యూహాన్ని అమలు చేశారు.. మహమ్మారి నుంచి తమ గ్రామాన్ని కాపాడుకున్నారు. మహిళలు సాధించిన ఆ విజయగాథ వివరలు.. 

మధ్య ప్రదేశ్‌లో ఇప్పటి వరకు మొత్తం 5 లక్షలకు పైగా కరోనా భారిన పడగా అందులో  5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.. కానీ మధ్యప్రదేశ్‌ బేతుల్‌ నగరానికి సమీపంలో ఉన‍్న చిఖలార్‌ గ్రామంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. ఇందుకు కారణం ఆ గ్రామ మహిళల సంకల్పం. మహమ్మారి కట్టడి ఆ గ్రామ మహిళలు తమకు తామే స్వచ్ఛందంగా లాక్‌ డౌన్‌ విధించుకున్నారు. ఊరి నుంచి బయటకు వెళ్లకుండా వెదురు కర్రలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ గ్రామాన్ని ఆనుకొని జాతీయ రహదారి ఉండడంతో మహిళలు ఊరిభయట కర్రలు పట్టుకొని కాపాలా కాస్తున్నారు. బయటి నుంచి ఎవరిని గ్రామంలోకి రానీవ్వడం లేదు. ఇక ఊరి వారికి ఏవైనా ముఖ్యమైన పనులుంటే వాటి కోసం ఇద్దరు యువకులను కేటాయించారు. వ్యక్తిగత హాజరు మినహా మిగతా పనులన్నింటిని వారే చక్కబెడుతున్నారు. 

ఇలా ఊరి బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకున్న మహిళలు.. మహమ్మారిని తమ గ్రామ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీరిపై నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహిళలు తలుచుకుంటే కరోనా కాదు కదా.. దాని జేజేమ్మ కూడా ఏం చేయలేదు అంటూ ప్రశంసిస్తున్నారు. 

చదవండి: ‘‘ప్లీజ్‌ సార్‌ అలా చేయకండి.. మా అమ్మ చనిపోతుంది’’

మరిన్ని వార్తలు