ఒక బల్బు, టేబుల్‌ ఫ్యాన్‌; ఇంత బిల్లు ఎలా కట్టేది?

2 Jul, 2021 18:46 IST|Sakshi
రాంబాయి ప్రజాపతి

భోపాల్‌: మీటర్‌లో సాంకేతిక కారణాల వల్ల ఒక్కోసారి కరెంట్‌బిల్లులు షాక్‌ ఇస్తుంటాయి. ఇలాంటి చిత్రమైన అనుభవాలను ఇప్పటికే చాలాసార్లు చూశాం. వాటికి సంబంధించిన బిల్లులు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మధ్యప్రదేశ్​కు చెందిన ఒక నిరుపేద వృద్ధురాలికి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఇళ్లల్లో పనిచేసే ఆ వృద్ధురాలు ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. కేవలం ఒక  లైటు, టేబుల్​ ఫ్యాన్​ మాత్రమే ఉన్న ఆ ఇంటికి ఏకంగా రూ .2.5 లక్షల బిల్లు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయింది.

వివరాలు.. మధ్యప్రదేశ్​లోని గుణ జిల్లాకు చెందిన 65 ఏళ్ల రాంబాయి ప్రజాపతి స్థానికంగా ఉన్న ఇళ్లలో పనిచేసుకుంటూ ఒక పూరి గుడిసెలో నివసిస్తుంది.ఆమెకు ఇంట్లో ఒక లైట్‌, టేబుల్‌ ఫ్యాన్‌ తప్ప మరే వస్తువు లేదు. ప్రతీనెల ఆమెకు రూ. 300 నుంచి రూ. 500కు మించి కరెంట్ బిల్లు వచ్చేది. కానీ గత నెలలో ఏకంగా రూ .2.5 లక్షల కరెంట్​ బిల్లు రావడం చూసి షాకైంది. విద్యుత్​ అధికారుల ముందు తన గోడు వెల్లబోసుకునేందుకు స్థానిక విద్యుత్ కార్యాలయానికి వెళ్లింది. కానీ అక్కడ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఎవరైనా అధికారి కలిస్తే తన గోడు వెల్లబోసుకోవచ్చని అప్పటినుంచి ప్రతిరోజు విద్యుత్‌ కార్యాలయం చుట్టు ప్రదర్శనలు చేస్తుంది.

ఈ సందర్భంగా రాంబాయి ప్రజాపతి మాట్లాడుతూ.. '' నేను చాలా సంవత్సరాల నుంచి షాన్టీ ప్రాంతాలోని ఒక గుడిసెలో నివసిస్తున్నాను.ఇంత చిన్న పూరి గుడిసెలో నివసించే నాకు లక్షల్లో బిల్లు ఎలా వచ్చిందో తెలియడం లేదు. దీనిపై అధికారును సంప్రదిస్తే వారు అస్సలు పట్టించుకోవడం లేదు. నా సమస్య పరిష్కారం కోసం కేవలం విద్యుత్​ అధికారులనే కాదు స్థానిక ప్రజా ప్రతినిధులను, గుణ కలెక్టర్ కూడా కలిశాను. కానీ ఎవరూ నా సమస్యను పరిష్కరించలేదు” అని వాపోయింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు