మాకొక వందే భారత్‌ కావలెను.. రైల్వేస్‌కు కేంద్ర మంత్రులతో సహా విజ్ఞప్తుల వెల్లువ

21 Feb, 2023 19:23 IST|Sakshi

ఢిల్లీ: వందేభారత్‌ రైళ్లకు అక్కడ ఫుల్‌ గిరాకీ ఉంటోంది. ప్రయాణికులతో అనుకునేరు. మా రూట్‌లలో ఆ రైలు నడపండి మహాప్రభో అంటూ కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు పలువురు ఎంపీలు. వాళ్లలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సైతం ఉండడం గమనార్హం. 

గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో.. భారత్‌లో సెమీ హైస్పీడ్‌ రైల్‌గా వందే భారత్‌ పేరొందింది. టికెట్‌ ధర ఎక్కువే అయినా.. ఫ్లైట్‌లో ఉండేలా అత్యాధునిక వసతులు, త్వరగతిన గమ్యస్థానానికి చేర్చుతుండడంతో వందే భారత్‌ రైళ్లను తమ నియోజకవర్గాల్లోని ప్రజలు కోరుకుంటున్నారని చెబుతూ ఎంపీలు.. కేంద్ర రైల్వేశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.

పార్లమెంట్‌ నుంచి దాదాపు 60 మంది ఎంపీలు.. వందే భారత్‌ రైళ్లను తమ రూట్‌లలో నడపాలంటూ కేంద్ర రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. వందే భారత్‌ 2.0 సూపర్‌ సక్సెస్‌ అయ్యింటూ లేఖలో పేర్కొన్నారు వాళ్లు. వీళ్లలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. 

అలాగే పలువురు బీజేపీ ఎంపీలతో పాటు విపక్షాల నుంచి 14 మంది ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా రైల్వేస్‌కు విజ్ఞప్తి చేసినవాళ్లలో ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పది వందే భారత్‌ రైళ్లు వివిధ రూట్‌లలో ప్రయాణిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నడుమ సికింద్రాబాద్‌-విశాఖపట్నం నడుమ వందే భారత్‌ రైలు నడుస్తోంది. 

మరిన్ని వార్తలు