మోదీకి చురక:‍ పెట్రోల్‌ ధరలపై బావమరుదుల భగ్గు

22 Feb, 2021 16:51 IST|Sakshi

ఢిల్లీలో రాబర్ట్‌, వయనాడ్‌లో రాహుల్‌ ఆందోళన

న్యూఢిల్లీ: పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ వయనాడ్‌లో భారీ ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టగా.. ఆయన బావ (ప్రియాంకగాంధీ భర్త) రాబర్ట్‌ వాద్రా సైకిల్‌ తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. అడ్డూఅదుపు లేకుండా పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ గ్యాస్‌ ధరలు పెరగడంపై కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నిరసనల్లో భాగంగా సోమవారం బావబామరుదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బామ్మర్దికి పోటీగా బావా వాద్రా సైకిల్‌పై వేగంగా వెళ్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. 

ఢిల్లీలోని సుజన్‌సింగ్‌ పార్క్‌ నుంచి తన కార్యాలయం సుఖ్‌దేవ్‌ విహార్‌ ఆఫీస్‌ వరకు సైకిల్‌పై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏసీ కార్ల నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు చూడాలి’ అని పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చురకలంటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ‘యూపీఏ హయాంలో పెట్రోల్‌ ధరలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోదీ ఇప్పుడు ఏం చెబుతారు’ అని ప్రశ్నించారు. ఏదైనా సమస్యలు తలెత్తితే ఎప్పుడు ఇతరులపై బురద జల్లడం మోదీకి అలవాటే’ అని ఎద్దేవా చేశారు. సూటుబూటు వేసుకుని సైకిల్‌పై రావడం అందరినీ ఆకట్టుకుంది. ఒకవిధంగా రాహుల్‌ కన్నా రాబర్ట్‌కే ఎక్కువ గుర్తింపు వచ్చింది.

మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. ‘ప్రపంచమంతా రైతుల సమస్యలపై స్పందిస్తుంటే మోదీ ప్రభుత్వం మాత్రం కళ్లుండి చూడలేకపోతుంది’ అని తెలిపారు. వెంటనే కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘22 మంది ప్రజల జేబులు ఖాళీ చేస్తూ తమ స్నేహితుల జేబులు నింపుతున్నట్లు’ అభివర్ణించారు. ధరల పెంపుతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీజేపీ పెట్రోల్‌ దోపిడీ’ అని కొత్తగా హ్యాష్‌ట్యాగ్‌ క్రియేట్‌ చేసి ట్వీట్‌ చేశారు.
 

చదవండి: కట్టెలు, మట్టి పొయ్యితో అసెంబ్లీకి
చదవండి: నాగాలాండ్‌లో అరుదైన దృశ్యం.. 58 ఏళ్ల తర్వాత

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు