ప్రభుత్వ లెక్కల ప్రకారం 27 ఏళ్లు; అందుకే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నా

2 Jul, 2021 17:02 IST|Sakshi
భార్య కర్మీదేవితో మృతక్‌ లాల్‌ బిహారి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘఢ్‌ జిల్లాకు చెందిన ఖలీలాబాద్‌ గ్రామవాసి మృతక్‌లాల్‌ బిహారి. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి మరొకరిని పెళ్లి చేసుకుని, కొడుకును తీసుకుని ముబారక్‌ పూర్‌కి వెళ్లింది. చదువు అబ్బకపోవడంతో బిహారి బనారస్‌ చీరలు నేయడం నేర్చుకున్నాడు. 22 ఏళ్ల వయసులో తండ్రికి ఊరిలో ఉన్నకొద్ది పాటి స్థలంలో మగ్గాలు పెట్టాలనుకున్నాడు. అందుకు ఆయనకు బ్యాంక్‌ లోన్‌ అవసరమైంది. గ్రామంలో ఉంటున్నట్టుగా గుర్తింపు పత్రం కోసం జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడే లాల్‌ బిహారికి ఆశ్చర్యకర విషయం తెలిసింది. రెవెన్యూ రికార్డులో అప్పటికే లాల్‌ బిహారీ మరణించినట్లుగా ఉంది.దీనిప్రకారం ప్రభుత్వ రికార్డుల్లో ఆయన చనిపోయాడు.  

తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు బిహారి 18 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం 64 ఏళ్ల వయసున్న లాల్‌ బిహారీ ప్రభుత్వ లెక్కల ప్రకారం తన వయస్సు 27 ఏళ్లని అందుకే నా భార్య కర్మీదేవిని మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. '' 2022లో తమ పెళ్లి జరగనుందని.. 56 ఏళ్ల నా భార్య మెడలో మళ్లీ తాళి కట్టనున్నాను. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1994లో మళ్లీ పుట్టిన నాకు ఇప్పుడు 27 ఏళ్లు. నేను బతికే ఉన్నానని దేశంలో మరింత మందికి తెలియజెప్పేందుకే వివాహం చేసుకుంటున్నా.

ఊరిలో ఉన్న వ్యవసాయ భూమిని దక్కించుకునేందుకు దగ్గరి బంధువొకరు చేసిన పని అది.నా ఆస్తిని దక్కించుకునేందుకు మా దగ్గరి బంధువు ప్రభుత్వ అధికారికి 300 రూపాయల లంచం ఇచ్చి నేను జూలై 30, 1976లో మరణించినట్టుగా రాయించాడు. విచిత్రమేమిటంటే ఆ అధికారి ఒకప్పుడు నా మిత్రుడే. లంచానికి ఆశపడి ఎదుటివారికి లాభం చేకూర్చేందుకు అలా చేశాడని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు.


కాగా బిహారి తన 18 ఏళ్ల పోరాటంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. మొదట్లో ఆయన కేసు విని కొంతమంది లాయర్లు నవ్వితే, మరికొందరు సానుభూతి తెలిపారు. స్థానికులు బిహారీని దెయ్యంగా పిలిచేవారు. చిన్నపిల్లలు ఆయనను చూసి పారిపోయేవారు. అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ బిహారీకి ఆయన భార్య కర్మీదేవి మాత్రం తోడుగా నిలిచింది. ఆమె సహకారంతోనే బిహారి ఒక పథకం ఆలోచించాడు. తాను బతికే ఉన్నానని అధికారులకు తెలియజేసేందుకు ప్రభుత్వ అధికారికి లంచం ఇచ్చిన తన బంధువు కొడుకును కిడ్నాప్‌ చేశాడు. ఎలాగైనా తన పేరు మీద కేసు రిజిస్టర్‌ కావాలనుకున్నాడు.

ఎన్నికల్లో పోటీ చేయడం, భార్యకు వితంతు పెన్షన్‌ రాబట్టడం కోసం ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించడం, ‘ముఝే జిందా కరో’ (నన్ను బతికించండి) అనే ప్లకార్డుతో అసెంబ్లీలోకి దూసుకెళ్లడం... ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వజూపుతూ పట్టుబడటం, తన శవ ఊరేగింపు తనే జరుపుకోవడం వంటి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ విధంగా స్థానిక వార్తల్లోకి ఎక్కాడు. ఆయన చేసిన పోరాటాల ఫలితంగా చివరకు జూన్‌ 30, 1994లో జిల్లా యంత్రాంగం లాల్‌ బిహారీ బతికున్నట్టుగా గుర్తించింది. 

లాల్‌ బిహారీ పోరాటాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ ఆయన జీవితాన్ని తెరకెక్కించాడు. ‘కాగజ్‌’గా ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో ప్రధాన పాత్రను ప్రముఖ నటుడు పంకజ్‌ త్రిపాఠి పోషించారు. ఇందులో ఆయన భార్య కర్మీదేవిగా మోనాల్‌ గజ్జర్‌ నటించారు. ఈ సినిమాకు ప్రముఖ హీరో సల్మాన్‌ఖాన్‌ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. 

మరిన్ని వార్తలు