MSRTC Workers Protest: ఆర్టీసీ కార్మికుల సమ్మె.. శరద్‌ పవార్‌ ఇంటిపై చెప్పులు విసిరిన కార్మికులు

8 Apr, 2022 18:50 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఎమ్‌ఎస్‌అర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ సంస్థకు చెందిన కార్మికులు ముంబైలోని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఇంటిని చుట్టుముట్టారు. దక్షిణ ముంబైలోని పవార్ నివాసం 'సిల్వర్ ఓక్' వద్దకు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయంగా అనుభవజ్ఞుడైన శరద్‌ పవర్‌.. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరసనలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల్లో కొందరు రోడ్డుపై బైఠాయించగా మరికొందరు ఆగ్రహం పట్టలేక శరద్‌ పవర్‌ ఇంటిపై రాళ్లు, చెప్పులు, బూట్లు విసిరారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో శరద్‌ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భద్రత బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాగా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ గత నవంబర్‌ నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: గవర్నర్‌, సీఎం... విభేదాల పర్వం

ఆ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ.. ‘సమ్మె మొదలైనప్పటి నుంచి 120 మంది కార్మికులు మరణించారు. ఇవన్నీ ఆత్మహత్యలు కావు, ప్రభుత్వ విధానం వల్ల జరిగిన హత్యలు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం. ఎన్సీపీ చీఫ్‌ సమస్యను పరిష్కరించేందుకు ఏ కృషి చేయలేదు. హైకోర్టు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మేము ప్రభుత్వంతో మా సమస్యల గురించి చర్చిస్తున్నాం. ప్రజల చేత ఎన్నికోబడిన ప్రభుత్వం నేడు మా కోసం ఏం చేయడం లేదు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ‘మహా వికాస్ అఘాడి’ ప్రభుత్వంలో చాణక్యగా వ్యవహరించే శరద్‌ పవార్‌ కూడా మా  కార్మికుల మరణాలకు కారణం.’ అంటూ మండిపడ్డారు

కాగా ఏప్రిల్ 22 నాటికి సమ్మెలో ఉన్న కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బొంబాయి హైకోర్టు ఆదేశించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. హైకోర్టు గడువులోపు విధుల్లో చేరే కార్మికులపై ఎటువంటి చర్య తీసుకోమని కోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు