ఐటీ జాబ్‌ కూడా తక్కువే!.. ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

4 Mar, 2023 15:28 IST|Sakshi

సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి లైఫ్‌ స్టైల్‌, లగ్జరీ కార్లు, భవనాలు, సంపద ఇలా ఏదో ఒకటి వార్తల్లో నిలుస్తూనే ఉండడం షరా మామూలే. అయితే ఒక్కోసారి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి దగ్గర పని చేస్తున్న సిబ్బందికి సంబంధించి విషయాలు కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ డ్రైవర్‌ సాలరీపై సోషల్‌మీడియాలో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

2017లో ముకేశ్‌ అంబానీ డ్రైవర్ జీతం నెలకు రెండు లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు నెట్టింట ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. దీని ప్రకారం.. అంబానీ డ్రైవర్‌కు ఏడాదికి రూ.24 లక్షలు. ఐటీ రంగంలో కొన్ని కంపెనీల సీఈఓలకు, ఇతర సంస్థల్లో పనిచేసే వృత్తి నిపుణులకు కూడా ప్రస్తుత రోజుల్లో ఈ స్థాయి జీతం లభించడం లేదు. ఐదేళ్ల క్రితమే రూ.2 లక్షలుంటే.. అయితే 2023లో అతని జీతం ఎంత అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నగా మారి ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది.

వామ్మో.. అంత సాలరీ ఎందుకు
సెలబ్రిటీల కుటుంబానికి డ్రైవర్‌గా జీవితం అంత తేలికైన విషయం కాదు. అందులోనూ ప్రపంచకుబేరుడు ఇంట్లో సిబ్బందిగా పనిచేయాలంటే.. వాళ్లు చేసే పనికి సంబంధించి ఎంతో నైపుణ్యం ఉండాల్సిందే. వివరాల ప్రకారం వీరిని ఒక ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నియమించుకుంటారట. కేవలం వీరికి డ్రైవింగ్‌ నైపుణ్యంతో పాటు సెలబ్రిటీల లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు అనుకూలంగా నడుచుకోవడం, యజమానుల వద్ద అనుసరించాల్సిన విధివిధానాలు, క్రమ శిక్షణ కూడిన ప్రవర్తనతో పాటు మరికొన్ని అంశాలతో కఠినమైన శిక్షణను కూడా అందిస్తారు.

వీటితో పాటు లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలా నడపాలి..? అని ఆ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ ఇస్తుంటాయని సమాచారం. అంతేకాకుండా ఏ తరహా రోడ్ల పై, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితుల మధ్య అయినా వాహనాన్ని నడిపేలా వీరికి ట్రైనింగ్‌ ఇస్తారు. ఇంత తతంగం ఉంది కనుకే వారి జీతం కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో సెలబ్రీటల ఇంట పని చేస్తున్న సిబ్బంది జీతాలు ఆకర్షణీయంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.

చదవండి: ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు