అంబానీ ఇంటి వద్ద కలకలం: మళ్లీ అక్కడే మరో మృతదేహం

20 Mar, 2021 20:08 IST|Sakshi

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ నివాసం 'యాంటిలియా' వద్ద అనుమానాస్పద వాహనం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అనుమానాస్పద స్థితిలో వాహన యజమాని మన్సుఖ్‌ హిరేన్‌ శవమై తేలిన విషయం తెలిసిందే. తాజాగా మరొక మృతదేహం లభించింది. అంబానీ ఇంటి వద్ద కలకలానికి ఈ మృతదేహానికి సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు లభించిన కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తు చేస్తున్నాయి. ముంబైకి సమీపంలోని చిన్న కాలువ దగ్గర స్కార్పియో యజమాని మృతదేహం లభించిన చోటే తాజాగా శనివారం ఓ మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు 48 ఏళ్ల షేక్‌ సలీమ్‌ అబ్దుల్‌ అని గుర్తించారు. రేతి బందర్‌ ప్రాంతంలో నివసించే సలీమ్‌ కూలీ పని చేసేవాడని తెలుసుకున్నారు. సముద్రపు ఒడ్డున నిద్రించి ఉన్నప్పుడు నీటిలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అయితే అతడు ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటాడని ముంబ్రా పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి 25న అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలు కలకలం రేపాయి. అందులోని ఒక వాహనం స్కార్పియో యజమాని హిరేన్‌ మార్చి 5వ తేదీన ముంబై సమీపంలోని ఒక కొలనులో శవమై తేలాడు. దీనికి సంబంధించి మూడు కేసులను ఎన్‌ఐఏ, ఏటీఎస్ విచారిస్తున్నాయి. ఈ కేసులో రోజుకో పరిణామం వెలుగులోకి వస్తున్నాయి.

మరిన్ని వార్తలు