Mulayam Singh Yadav Net Worth: ములాయం సింగ్‌కు కారు కూడా లేదు.. కొడుకు నుంచి 2 కోట్ల అప్పు..ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

10 Oct, 2022 15:42 IST|Sakshi

లక్నో: రాజకీయ దిగ్గజం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌(82) కన్నుమూసిన విషయం తెలిసింది. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ములాయం.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆనారోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆసుపత్రిలోనే ఉన్నారు. ములాయం సింగ్‌ మరణాన్ని ఆయన కుమారుడు ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘మా తండ్రి,  మీ ‘నేతాజీ’ ఇక లేరు. ములాయం సింగ్‌ యాదవ్‌ అంత్యక్రియలు అక్టోబర్‌ 11(మంగళవారం) సౌఫయ్‌ గ్రామంలో జరుగుతాయి’. అని తెలిపారు.

ములాయం సింగ్‌ ఆస్తులు
జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ప్రాంతీయ నేతగా గుర్తింపు పొందిన ములాయం సింగ్ ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ములాయం సింగ్‌ నికర ఆస్తులు విలువ రూ. 20.56 కోట్లు. ఈ అఫిడవిట్‌ ప్రకారం తన మొత్తం చర, స్థిరాస్తులు దాదాపు రూ.16.5 కోట్లు.(16,52,44,300). 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌తో పోలిస్తే ఇది రూ. 3.20 కోట్లు తక్కువ. వీటితోపాటు ములాయం ఏటా రూ.32.02 లక్షలు సంపాదిస్తుండగా.. ఆయన భార్య సాధనా యాదవ్ వార్షికాదాయాన్ని రూ. 25.61 లక్షలుగా పేర్కొన్నారు.
చదవండి: ప్చ్‌.. ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు

బ్యాంక్ డిపాజిట్లు, బంగారం
ములాయం సింగ్ యాదవ్ వద్ద రూ.16,75,416 నగదు ఉండగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీల్లో రూ.40,13,928 డిపాజిట్లు ఉన్నాయి. మొత్తం రూ. 9,52,298 విలువైన ఎల్‌ఐసీ ఇతర బీమా పాలసీలను కలిగి ఉన్నాడు. అంతేగాక ఆభరణాల విషయానికొస్తే.. ఆయన వద్ద 7.50 కిలోల బంగారం ఉంది. దీని విలువ రూ.2,41,52,365. తదితర ప్రాంతాల్లో ఆయనకు రూ.7,89,88,000 విలువైన వ్యవసాయ భూమి కూడా ఉంది. వ్యవసాయేతర భూమిపరంగా రూ.1,44,60,000 విలువైన ఆస్తులు ఉన్నాయి. యూపీలో అతని నివాస ప్రాపర్టీ ధర రూ.6,83,84,566.
చదవండి: రక్షణ మంత్రిగా, సీఎంగా ఎనలేని సేవలందించారు!

కారు లేదు, కొడుకు నుంచి అప్పు
ములాయం సింగ్ యాదవ్ తన వద్ద కారు లేదని అఫిడవిట్‌లో వెల్లడించారు. అలాగే కుమారుడు అఖిలేష్ యాదవ్ నుంచి రూ.2,13,80,000(2.13 కోట్లు) అప్పు కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక ములాయం చదువు విషయానికొస్తే 1968లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తి చేశారు. 1964లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి బీటీ పట్టా పొందారు.

ఎస్పీలో విషాదఛాయలు
ములాయం మృతితో ఎస్పీ పార్టీలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ములాయం అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సైఫయిలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి, రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. కాగా  22 నవంబర్ 1939న యూపీలోని ఇటావా జిల్లాసైఫయ్ గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ములాయం రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా సేవలు అందించారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు.
ఇది కూడా చదవండి: ఎస్పీకి ఆయనో నేతాజీ.. కుస్తీల వీరుడు కూడా!

ములాయం సింగ్‌ ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా పనిచేశారు. యూపీ రాజకీయాల్లో చక్రం తిప్పడంతోపాటు జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రముఖపాత్ర పోషించారు.పదిసార్లు ఎమ్మెల్యే, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో(1996-98) రక్షణశాఖ మంత్రిగానూ సేవలందించారు. సుధీర్ఘకాలంపాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగారు. పార్టీ నేతలు, అభిమానులు ఆయన్ను ముద్దుగా నేతాజీ అని పిలుచుకుంటారు. ఆయన తుదిశ్వాస వరకు మెయిన్‌పూరి లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు