ముంబైలో నిషేధాజ్ఞల కొనసాగింపు.. కర్ఫ్యూ, 144 సెక్షన్‌ అమలు

2 Dec, 2022 20:54 IST|Sakshi

సాక్షి, ముంబై: నగరంలో పోలీసులు నిషేధాజ్ఞల కొనసాగింపుకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ  పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండేందుకే ముందస్తుగా  ముంబై పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రజా జీవనానికి విఘాతం కలిగే అవకాశం ఉందని, ప్రాణ-ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు.. గత మూడు నెలలుగా ఈ ఆదేశాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో.. బహిరంగ సమావేశాలు, సామూహిక ప్రదర్శనలు, ఇతర వేడుకలకు ఎక్కువగా అనుమతులు ఇవ్వడం లేదు. తాజాగా కర్ఫ్యూ, 144 సెక్షన్‌..  వివాహ కార్యక్రమాలు, అంత్యక్రియలకు వర్తించబోవని ముంబై నగర పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది.

ముంబైలో ఈ మధ్య చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందస్తుగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు డీసీపీ విశాల్‌ థాకూర్‌. కర్ఫ్యూ, 144 సెక్షన్‌ అమలు.. డిసెంబర్‌ 17వ తేదీ వరకు అమలు ఉంటుందని ముంబై పోలీసులు తెలిపారు. ఆ తర్వాత దానిని పొడగించే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు. ఈ పదిహేను రోజుల పాటు రోడ్లపై ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడం, ఊరేగింపులు, మైకుల్లో ప్రచారాలు.. ప్రసంగాలు, సంగీత వాయిద్యాల ప్రదర్శన, మతపరమైన ర్యాలీలు.. ప్రదర్శనలు, రోడ్లపై బాణాసంచా పేల్చడం.. ఇలాంటి వాటిపై నిషేధం అమలు కానుంది.  

ఇక..  బహిరంగంగా ఆయుధాల ప్రదర్శన కూడా నిషేధమని(డిసెంబర్‌ 4వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ దాకా) తెలిపారు. వివాహాలు, అంత్యక్రియలు, సినిమా థియేటర్లు, కంపెనీలు.. క్లబ్బుల కీలక సమావేశాలకు మాత్రం అనుమతులు ఇస్తారు. అలాగే కోర్టులు, కార్యాలయాలకు, విద్యాసంస్థలకు కర్ఫ్యూ, 144 సెక్షన్‌ నుంచి మిహానయింపులు ఇచ్చారు. 

మరిన్ని వార్తలు