నీ ఇల్లు బంగారం గానూ.. ఇంటి గోడలో రూ.10 కోట్లు, 19 కేజీల వెండి ఇటుకలు

26 Apr, 2022 18:50 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబైలో నగలు, వజ్రాల వ్యాపారానికి ప్రధాన నిలయమైన జవేరీ బజార్‌లో ఓ నగల వ్యాపారి తన కార్యాలయం గోడలో దాచిన భారీ ధనం బయటపడింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్ధానిక నగల వ్యాపారుల్లో కలకలం రేపింది. చాముండా బులియన్‌ అనే జ్వువెలర్స్‌ కార్యాలయంలో రాష్ట్ర జీఎస్టీ విభాగం ఆకస్మిక దాడి చేసింది. తనిఖీల్లో కార్యాలయం గోడలో దాచిన 19 కేజీల వెండి ఇటుకలు, రూ.10 కోట్లు నగదు బయట పడ్డాయి. ఈ ధనాన్ని అధికారులు జప్తు చేశారు. రాష్ట్ర జీఎస్టీ విభాగానికి చెందిన అధికారులు జీఎస్టీ ఎగ్గొడుతున్న వ్యాపారులపై దాడులు చేయడం ప్రారంభించారు.

అందులో భాగంగా చాముండా బులియన్‌ జ్వువెలర్స్‌ కార్యాలయంలో దాడులు చేసినట్లు అధికారు లు తెలిపారు. ఈ కార్యాలయంలో 2019– 20లో రూ.22.83 కోట్లు, 2020–21లో రూ. 665 కోట్లు, 2022లో 1,764 కోట్లకుపైనే లావాదేవీలు జరిగాయి. దీంతో ఏటా పెరుగుతున్న ఆర్థిక లావాదేవీలను గమనించిన జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో సోదా చేయడం ప్రారంభించారు.
చదవండి👉  ఎంపీ నవనీత్‌కౌర్‌ ఆరోపణలకు పోలీసుల కౌంటర్‌

ఈ కంపెనీకి అనేక శాఖలున్నప్పటికీ అందులో కొన్నింటికి రిజిస్ట్రేషన్లు లేవని వారి దృష్టికి వచ్చింది. దీంతో దాడులు జరిపినప్పటికీ అధికారుల చేతికి ఏమి చిక్కలేదు. అయినప్పటికీ సోదా చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. చివరకు కార్యాలయాన్ని క్షుణ్ణంగా గాలించగా ఓ గోడలో దాచిపెట్టిన మొత్తం ధనం బయటపడింది. దీంతో జీఎస్టీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తనిఖీలు కొనసాగిస్తే మరింత ధనం దొరకవచ్చని అనుమానిస్తున్నారు. జీఎస్టీ, ఆదాయ పన్ను అధికారుల ద్వారా దర్యాప్తు కొనసాగుతోంది.   

మరిన్ని వార్తలు