కరోనా ఎఫెక్ట్‌: ముంబైలో రక్తం దొరకట్లేదు

5 Apr, 2021 00:39 IST|Sakshi

వారం రోజులకే సరిపోనున్న ప్రస్తుత నిల్వలు 

ఆస్పత్రుల్లో రోగుల తంటాలు.. వాయిదా పడుతున్న ఆపరేషన్లు 

కరోనా నేపథ్యంలో రక్తదానానికి ముందుకురాని దాతలు 

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని రక్తం కొరత వేధిస్తోంది. నగరంలోని బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం నిల్వలు కనిష్టస్థాయికి తగ్గిపోయాయి. ప్రస్తుతం కేవలం 25 వేల యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రక్తం కేవలం వారం లేదా పది రోజులకు సరిపోనుంది. దీంతో ఈ రక్తం నిల్వలు అయిపోతే పరిస్థితి ఏమిటా అని అటు డాక్టర్లు, రోగులు తలలు పట్టుకుంటున్నారు. గతేడాది బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వల పరిస్థితి రోజురోజుకు దిగజారడంతో స్వయంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చొరవ తీసుకున్నారు. ముంబైలో రక్తం కొరత తీవ్రంగా ఉందని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సార్వజనిక మండళ్లకు, సేవా సంస్థలకు పిలుపునిచ్చారు. ఆ మేరకు అనేక మండళ్లు, సేవా సంస్థలు ముందుకు వచ్చి రక్తాన్ని సేకరించాయి. దీంతో కొన్నిరోజుల పాటు బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వలు పెరిగినప్పటికి.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కరోనా మళ్లీ పడగ విప్పడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. 

కరోనాతో రక్తదాన శిబిరాలు బంద్‌ 
కరోనా కారణంగా రక్తదాన శిబిరాలు నిర్వహణ సాధ్యం కావడం లేదు. సాధారణంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడంలో కాలేజీలు, ఐటీ, కార్పొరేట్‌ సెక్టార్లు అగ్రస్థానంలో ఉండేవి. కానీ కరోనా వల్ల వీటి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఐటీ, కార్పొరేట్‌ సెక్టార్లలో చాలా మంది వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసుకుంటున్నారు. దీంతో గతేడాది నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహించలేకపోయారు. స్వ యంగా వచ్చి రక్తం ఇచ్చే దాతలూ కరువయ్యారు. దీంతో బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు గణనీయంగా తగ్గిపోయి కొరత ఏర్పడింది. ముంబైలో ప్రతీరోజు సరాసరి మూడు నుంచి ఐదు వేల యూనిట్ల రక్తం అవసరముంటుంది. పైగా బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వచేసిన రక్తం కేవలం 35 రోజుల వరకే ఉపయోగపడుతుంది. ఆ తరువాత రక్తంలోని కణాలు చనిపోవడం, శక్తి క్షీణించి నిరుపయోగంగా మారుతాయని నిపుణులు అంటున్నారు. దీంతో ఎప్పటికప్పుడు తాజా రక్తాన్ని సేకరించి నిల్వచేయాల్సి ఉంటుంది.  

అత్యవసర ఆపరేషన్లు మాత్రమే.. 
నగరంలో రక్తం కొరత వల్ల ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు చాలా ఇబ్బంది అవుతోంది. అత్యవసర ఆపరేషన్లకు మాత్రమే రక్తం సరఫరా జరుగుతోంది. రక్తం కొరత నేపథ్యంలో సామాన్య రోగులకు చేయాల్సిన ఆపరేషన్లను డాక్టర్లు వాయిదా వేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరమై ఆపరేషన్‌ చేయమని కోరితే.. రక్తం తెచ్చుకొమ్మని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో కొందరు బంధువులు రోగులను ఆస్పత్రిలోనే ఉంచి రక్తం కోసం బ్లడ్‌బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారు. ఇక కొన్ని బ్లడ్‌ బ్యాంకులు, ప్రైవేటు కేంద్రాలు రక్తం ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ.. అందుకు బదులుగా తమ రక్తాన్ని దానం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. లేకపోతే దాతలను వెంట తీసుకురావాలని అంటున్నాయి. అలా అయితేనే రక్తం ఇస్తామని చెబుతుండటంతో ఏం చేయాలో తెలియక రోగుల బంధువులు అయోమయంలో పడిపోతున్నారు.  

వ్యాక్సిన్‌తో కొందరిలో అయోమయం 
కరోనా టీకా తీసుకున్న కొందరు రక్తదానం చేసే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. తాము రక్తం ఇవ్వవచ్చో లేదో తెలియక అయోయమానికి గురవుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకునే ముందుగానీ, టీకా తీసుకున్న తరువాత గానీ కొన్ని రోజులపాటు రక్తదానం చేయకూడదని వదంతులు వస్తున్నాయి.   రెండు నెలల వరకు రక్తదానం చేయకూడదని కొందరు, పక్షం రోజుల తరువాత రక్తదానం చేయవచ్చని మరికొందరు రకరకాలుగా చెబుతుండటంతో దాతలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీంతో రక్తం ఇవ్వాలని ఉన్నప్పటికి కొందరు దాతలు భయపడి రక్తదానానికి ముందుకు రావడం లేదు.  

మరిన్ని వార్తలు