కేక్‌ ముక్క ఇన్‌స్పెక్టర్‌కు కష్టాలు తెచ్చిపెట్టింది

16 Jul, 2021 11:25 IST|Sakshi

ఢిల్లీ: తనకు తెలియకుండానే కరుడుగట్టిన నేరస్తుడికి కేక్‌ తినిపించి ఒక సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ కష్టాలు కొనితెచ్చుకున్నాడు. దీనికి  సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన రెండు వారాల క్రితం జరగ్గా.. తాజాగా గురువారం ఈ ఘటనపై డీసీపీ విచారణకు ఆదేశించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. దానిష్‌ షేక్ హత్యయత్నం సహా ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే ఒక కేసు విషయమై జోగేశ్వరి పోలీసులు దానిష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. అదే స్టేషన్‌లో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేంద్ర నెర్లీకర్‌ పుట్టినరోజు వేడుకలు హౌసింగ్‌ సొసైటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో దానిష్‌ కూడా అక్కడే ఉన్నాడు. ఈ సందర్భంగా దానిష్‌కు మహేంద్ర కేక్‌ తినిపించాడు. దాదాపు 15 సెకన్ల నిడివి ఉన్న వీడియో లీకవడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై మహేంద్ర నెర్లీకర్‌ స్పందింస్తూ..'' ఇది పాత వీడియో. కూల్చివేత పనులు జరుగుతున్న హౌసింగ్ సొసైటీని సందర్శించాను. అదే రోజు నా పుట్టినరోజు కావడంతో అక్కడే కొందరు అధికారులు నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో దానిష్‌ అక్కడ ఉన్నట్లు నాకు అసలు తెలియదు. ఆ వ్యక్తి ఒక అధికారి అని భావించి కేక్‌ తినిపించా. అనవసరంగా దీనిని ఒక ఇష్యూగా చూపిస్తున్నారు.'' అంటూ చెప్పుకొచ్చారు.ఘీ

ఈ ఘటనపై డిప్యూటీ పోలీసు కమిషనర్ మహేష్ రెడ్డి ప్రాథమిక విచారణకు ఆదేశించారు. అసలు ఒక నేరస్తుడు ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉన్నాడు.. అతన్ని ఎవరు తీసుకొచ్చారు అనే కోణంలో విచారిస్తున్నారు. కాగా సకినాకా డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఈ విచారణను నిర్వహిస్తారని తెలిపారు. ప్రస్తుతం మహేంద్ర నెర్లీకర్‌ను కంట్రోల్‌ రూమ్‌కు అటాచ్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు