సీనియర్‌ లాయర్‌ను రంగంలోకి దింపిన షారూఖ్‌.. ఎవరాయన?

26 Oct, 2021 20:10 IST|Sakshi

ముంబై: తన కుమారుడిని ఎలాగైనా జైలు నుంచి విడిపించేందుకు బాలీవుడ్‌ అగ్ర నటుడు షారూఖ్‌ ఖాన్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్యన్‌ ఖాన్‌ను బెయిల్‌పై తీసుకువచ్చేందుకు మాజీ అటార్నీ జనరల్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని రంగంలోకి దింపారు. మంగళవారం బాంబే హైకోర్టులో ఆర్యన్‌ ఖాన్‌ తరపున ఆయన వాదనలు వినిపించారు. ముంబై క్రూయిజ్‌ మాదక ద్రవ్యాల కేసుతో ఆర్యన్‌కు సంబంధం లేదనే కోణంలో ఆయన గట్టిగా వాదించారు. ఈ నేపథ్యంలో ముకుల్ రోహత్గీ గురించి నెటిజనులు సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలుపెట్టారు. (చదవండి: మా నాన్న హిందు, అమ్మ ముస్లిం..)

తలపండిన లాయర్‌
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అయిన ముకుల్ రోహత్గీ.. భారత్‌కు 14వ అటార్నీ జనరల్ (ఏజీ)గా 2014 నుంచి 2017 వరకు పనిచేశారు. అంతకుముందు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గానూ సేవలు అందించారు. 66 ఏళ్ల ఈ తలపండిన లాయర్‌.. పలు హైప్రొఫైల్‌, కీలక కేసులు వాదించారు. 


హైకోర్టు మాజీ జడ్జి కుమారుడు

ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అవధ్ బేహారీ రోహత్గీ కుమారుడైన ముకుల్ రోహత్గీ.. 2002 గుజరాత్ అల్లర్లు, బెస్ట్ బేకరీ, జహీరా షేక్ ఎన్‌కౌంటర్ల కేసుల విచారణలో సుప్రీం కోర్టులో గుజరాత్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఐపీసీలోని వివాదాస్పద సెక్షన్‌-377పై సుప్రీంకోర్టులో పిటిషనర్ల తరపున ప్రాతినిథ్యం వహించారు. 


సభర్వాల్‌ శిష్యుడు

ముకుల్ రోహత్గీ.. 1955, ఆగస్టు 17న ఢిల్లీలో జన్మించారు. ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా కోర్సు పూర్తి చేసిన తర్వాత యోగేశ్‌ కుమార్‌ సభర్వాల్‌ వద్ద ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. కొంత కాలం తర్వాత సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించి లాయర్‌గా మంచి పేరు సంపాదించారు. 1993లో ఢిల్లీ హైకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. 1999లో వాజపేయి ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ముకుల్ రోహత్గీ సతీమణి పేరు వసుధ, కుమారు పేరు సమీర్‌. (చదవండి: ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు?)

మరిన్ని వార్తలు