బీఎంసీలోకి ఎలక్ట్రిక్‌ వాహనాలు 

30 Jul, 2021 03:53 IST|Sakshi

కొనుగోలు చేయాలని కార్పొరేషన్‌ నిర్ణయం 

ఆగస్టు 15న అందుబాటులోకి వచ్చే అవకాశం 

సాక్షి, ముంబై: స్వచ్ఛ–సుందర్, కాలుష్య రహిత ముంబై కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్న బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కార్యాలయం పనులకు, అధికారుల పర్యటనకు, ఉన్నతాధికారులు ఇంటి నుంచి కార్యాలయానికి రావడానికి ఇలా వివిధ పనులకు ఉపయోగించేందుకు బ్యాటరీతో నడిచే వాహనాలను కొనుగోలు చేయనుంది. అందుకు బీఎంసీ ప్ర«ధాన కార్యాలయంతోపోటు, 24 వార్డు కార్యాలయాల్లో, గ్యారేజీల్లో చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించింది. పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే సంకల్పంతో చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ నుంచి బ్యాటరీతో నడిచే కొత్త వాహనాలను అందుబాటులోకి తేవాలని బీఎంసీ యోచిస్తోందని పర్యావరణ విభాగం డిప్యూటీ కమిషనర్‌ సునీల్‌ గోడ్సే తెలిపారు. 

200 వాహనాలు.. 
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వాహనాల సంఖ్యతోపాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు బెస్ట్‌ సంస్థ కూడా ఎలక్ట్రిక్‌ బస్సులు కొనుగోలు చేసింది. ఇదే తరహాలో బీఎంసీ సిబ్బంది, అధికారులు వినియోగించే ఫోర్‌ వీలర్స్‌తోపాటు చిన్న, చితక సామగ్రి, తేలకపాటి సరుకులు చేరవేసే వాహనాలను కొనుగోలు చేయనుంది. కార్లు, ఇతర ఫోర్‌ విలర్స్‌ వాహనాలను బీఎంసీ కమిషనర్, డిప్యూటీ, అదనపు, సహాయ కమిషనర్లకు, ఉన్నతాధికారులకు అందజేయనుంది. సుమారు 200 వరకు బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలున్నాయని గోడ్సే తెలిపారు.

దశల వారిగా వీటిని వినియోగంలోకి తేనుంది. బ్యాటరీతో నడిచే వాహనాల సంఖ్య పెరగడంతో బీఎంసీకి చెందిన అన్ని కార్యాలయాలలో, గ్యారేజీలలో చార్జీంగ్‌ పాయింట్‌ నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటి దశలో 35 చోట్ల, ఆ తరువాత 100కుపైగా కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటితోపాటు విద్యుత్‌ పొదుపు చేసేందుకు సోలార్‌ విద్యుత్‌ ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేయాలని బీఎంసీ భావిస్తోంది. కార్యాలయం పనులకు ఎలాంటి ఇబ్బందులు లేని చోట ఈ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.   

మరిన్ని వార్తలు