ముంబైలో భారీ వర్షాలు; రైళ్లు బంద్‌!

23 Sep, 2020 19:35 IST|Sakshi

ముంబై: ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. అంతేగాక నగరానికి వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పలు రైలు సర్వీసులను నిలిపివేశారు. సెంట్రల్‌, హార్బర్‌ లైన్లలో రాకపోకలు నిలిచిపోయినట్లు బ్రుహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. బాంబే హైకోర్టు కూడా నేడు సెలవు ప్రకటించినట్లు వెల్లడించింది. (చదవండి: ముంబై :టీవీ నటులను తాకిన డ్రగ్స్‌ సెగ)

ఇక గత ఇరవై నాలుగు గంటల్లో ముంబైలోని పశ్చిమ ప్రాంతం(శాంతాక్రజ్‌ అబ్జర్వేటరీ)లో 286.4 మి.మీ., కొలాబా అబ్జర్వేటరీ(సౌత్‌ ముంబై)మేర వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇంతకంటే భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా వర్షాల ధాటికి లోతట్లు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ కష్టాలను వివరిస్తూ,  సాయం చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు