మాదకద్రవ్యాల స్వర్గధామంగా ముంబై? 

8 Oct, 2021 06:44 IST|Sakshi

ఏడాదిలో రూ. 200 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత 

144 కేసుల్లో 300 మందిని అరెస్టు చేసిన ఎన్‌సీబీ 

274 కేసుల్లో 4,412 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం మాదక ద్రవ్యాలకు స్వర్గధామంగా మారిందా అంటే అవుననే సమాధానమే కరెక్టేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఒక్క నగరంలోనే గత ఏడాది కాలంలో జాతీయ నార్కొటిక్స్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు, పోలీసులు దాదాపు రూ. 200 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఇటీవల మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఓ కేసులో అరెస్టు కావడంతో మరోసారి డ్రగ్స్‌ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, గత ఏడాది కాలంలో జాతీయ నార్కొటిక్స్‌ బ్యూరో (ఎన్‌సీబీ), ముంబై పోలీసులు చేసిన వేర్వేరు దాడులలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిపై చర్యలు తీసుకున్నారు.

దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ మరణానంతరం ఎన్‌సీబీ ముంబైలో మాదక ద్రవ్యాల విక్రేతలపై నిఘా వేసింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ దాడులు చేయడం మొదలు పెట్టింది. గత సంవత్సర కాలంలో ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 144 కేసులలో 300 మందిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. అదేవిధంగా 150 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఎన్‌సీబీ అరెస్టు చేసిన వారిలో 34 మంది నైజీరియన్లు (విదేశీయులు) ఉన్నారు. వీరి వద్ద 30 కిలోల చరస్, 12 కిలోల హెరాయిన్, రెండు కిలోల కొకైన్, 350 గ్రాముల గంజాయి, 25 గ్రాముల మెఫ్రెడాన్‌ తదితర మాదక ద్రవ్యాలను ఎన్‌సీబీ స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పరిశీలించినట్టయితే ఎన్‌సీబీ మొత్తం 94 కేసులు నమోదు చేసింది.

ఇక, ముంబై పోలీసులు గత సంవత్సర కాలంలో సుమారు రూ. 78 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 274 కేసులను నమోదు చేశారు. 4,412 మంది మాదక ద్రవ్యాల విక్రేతలు, సేవించిన వారిని అరెస్టు చేశారు. 2021 ఆగస్టు వరకు ముంబై పోలీసులు 12 కేసులలో రూ. 8.10 కోట్ల విలువైన హెరాయిన్, రూ. 12.27 కోట్ల విలువైన చరస్, రూ. 9.57 కోట్ల విలువైన కొకైన్, రూ. 6.58 కోట్ల విలువైన గంజాయి, రూ. 25.21 కోట్ల విలువైన మెఫ్రెడాన్‌ (ఎండీ), రూ. 18.90 లక్షల ఎల్‌ఎస్‌డీతో పాటు సుమారు రూ. 55 లక్షల విలువైన ఇతర మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.   

మరిన్ని వార్తలు