లాక్‌డౌన్‌లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు 

3 Jul, 2021 00:41 IST|Sakshi

అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో పెరిగిన కట్టడాలు 

ఏడాదిలో ఏకంగా 13 వేలకుపైగా ఫిర్యాదులు 

466 అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన బీఎంసీ 

కుర్లా, గోవండీ, మాన్‌ఖుర్ద్‌ ప్రాంతాల్లో అధిక ఫిర్యాదులు  

సాక్షి, ముంబై: లాక్‌డౌన్‌ సమయంలో ముంబైతోపాటు ఉప నగరాల్లో అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా కారణంగా అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునే బీఎంసీ సిబ్బంది కరోనా నియంత్రించే పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు తెలుస్తోంది. 2020 మార్చి నుంచి 2021 ఫిబ్రవరి కాలవ్యవధిలో బీఎంసీ కార్యాలయానికి ఏకంగా 13 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో కేవలం 466 అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు.  

తనిఖీలు లేక.. 
కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వ, బీఎంసీ అధికారులెవరూ కార్యాలయాల నుంచి బయటపడలేదు. ముఖ్యంగా మురికివాడల్లోకి తనిఖీలకు వెళ్లలేదు. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు మురికివాడల్లో ఖాళీ ఉన్న స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అనేక ఇళ్లపై రెండు, మూడు అంతస్తులు అక్రమంగా నిర్మించుకున్నారు.  

కరోనా నియంత్రణ పనుల్లో 90 శాతం సిబ్బంది  
గత సంవత్సరం కరోనా వైరస్‌ తెరమీదకు రావడంతో బీఎంసీ అధికారులు, ఇతర సిబ్బంది మహమ్మారిని నియంత్రించే పనులు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి మార్గదర్శనం చేయడం, కరోనా విస్తరించకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై సలహాలివ్వడం, మాస్క్‌లు, మందులు పంపిణీ చేయడం, రోగులను ఆస్పత్రులకు చేర్చడం తదితర విధుల్లో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత కోవిడ్‌ సెంటర్లు, జంబో కోవిడ్‌ కేంద్రాల నిర్మాణం, అందులో రోగులకు కల్పించాల్సిన సదుపాయాలపై ప్రధానంగా దృష్టిసారించారు. ఇలా 90 శాతం సిబ్బంది కరోనా నియంత్రణ పనుల్లోనే బిజీ అయ్యారు. దీంతో నగరంలో, మురికివాడల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే సమయం దొరకలేదు.

కనీసం పర్యటించడానికి కూడా వెళ్లలేదు. ఫిర్యాదులు వచ్చినప్పటికీ చర్యలు తీసుకునేందుకు వెళ్లాలంటే తగినంత సిబ్బంది అందుబాటులో లేరు. బాధితులు తిరగబడకుండా బీఎంసీ సిబ్బందికి రక్షణగా వెళ్లే పోలీసులు కూడా కరువయ్యారు. దీంతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదుల ద్వారా తెలిసినా అధికారులు వెళ్లలేకపోయారు. దీన్ని క్యాష్‌ చేసుకున్న మురికివాడల్లోని కొందరు ఇష్టమున్నట్లు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అత్యధికంగా అక్రమ నిర్మాణాలు తూర్పు ఉప నగరంలోని కుర్లా, గోవండీ, మాన్‌ఖుర్ద్‌ ప్రాంతాల్లో జరిగాయి. ఈ ప్రాంతాల నుంచి అక్రమ నిర్మాణాలకు సంబంధించిన  1,200–3,250 వరకు ఫిర్యాదులు వచ్చాయి. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు