మానవత్వం చాటుకున్న లేడీ కానిస్టేబుల్‌

12 Jun, 2021 20:18 IST|Sakshi

50 మంది పేద పిల్లలను దత్తత తీసుకున్న మహిళా కానిస్టేబుల్‌

ముంబై: ఖాకీలు అంటే కరుడుగట్టిన కఠినాత్ములే అనుకుంటే పొరపాటు. వారిలో కూడా మానవతావాదులు ఉంటారు. తోటి వారికి కష్టం వచ్చిందంటే చాలు అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా సాయం చేయడానికి ముందుకు వస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌ కథనం ప్రతి ఒక్కరిని హత్తుకుంటుంది. ఈ దశాబ్దపు మదర్‌ థెరీసా అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంతలా మెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే సదరు మహిళా కానిస్టేబుల్ 50 మంది పేద పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు. ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు వారి చ‌దువుకు అయ్యే ఖ‌ర్చుల‌ను తానే భ‌రిస్తాన‌ని తెలిపారు. మహారాష్ట్ర రాజ‌ధాని ముంబైకి చెందిన‌ పోలీస్ కానిస్టేబుల్ రెహనా షేక్ ఈ మేర‌కు ఉదార‌త చాటారు. ఒక స్కూలుకు చెందిన 50 మంది నిరుపేద పిల్ల‌ల‌ను ఆమె దత్తత తీసుకున్నారు.

ఆ వివరాలు.. ముంబైలో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రెహనా కొద్ది రోజుల క్రితమే ఎస్సై టెస్ట్‌ పాసయ్యారు. ఆమె భర్త కూడా డిపార్ట్‌మెంట్‌లోనే విధులు నిర్వహిస్తున్నాడు. ఇక వారి కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. వారందరి బాగోగులు చూడటమే కాక రెహనా ఇప్పుడు ఏకంగా మరో 50 మందిని దత్తత తీసుకోవడం అంటే మామూలు కాదు. 

‘‘గతేడాది నా కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా మా ఇంటికి వచ్చిన నా స్నేహితురాలు ఒక పాఠశాలకు చెందిన కొన్ని ఫొటోలు నాకు చూపించింది. అక్క‌డి పిల్ల‌ల‌ను చూసిన తరువాత వారికి నా సహాయం అవసరమని నేను గ్రహించాను. వారంతా మారుమూల గ్రామాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తెలిసింది. దాంతో ఆ 50 మంది పిల్లలను దత్తత తీసుకున్నాను. 10 వ తరగతి వరకు వారి విద్యా ఖర్చులను నేను భరిస్తాను అని తెలిపాను. ఇక నా కుమార్తె పుట్టిన రోజు, ఈద్‌ కోసం దాచిన డబ్బును వారికి ఇచ్చాను” అని కానిస్టేబుల్‌ రెహ‌నా షేక్ వెల్ల‌డించారు.

ఇక గతేడాది మహమ్మారి సమయంలో రక్తం,  ప్లాస్మా, బెడ్స్‌, ఆక్సిజన్‌ కావాలంటూ తనను ఆశ్రయించిన వారందరికి తన శక్తి మేరకు సాయం చేశారు రెహనా. బయటి వారికే కాక.. డిపార్ట్‌మెంట్‌ వారికి కూడా సాయం చేశారు. ఇక రెహనా చేస్తున్న సేవలను నగర కమిషనర్‌ హేమంత్ నాగ్రేల్ ప్రశంసించారు. సన్మానం చేసి ప్రశంసా పత్రం ఇచ్చారు. 

చదవండి: తగ్గేదే లే అంటూ తుపాకీ పట్టారు..

మరిన్ని వార్తలు