70 ఏళ్ల వృద్ధుడిని మృత్యువు నుంచి కాపాడిన ఇద్దరు లోకో పైలట్లు!

18 Jul, 2021 21:08 IST|Sakshi

ముంబై: ముంబై-వారణాసి ప్రత్యేక రైలు డ్రైవర్లు సకాలంలో స్పందించి అత్యవసర బ్రేకులు వేయడంతో ముంబై సమీపంలోని కళ్యాణ్ స్టేషన్ వద్ద పట్టాలు దాటుతున్న ఒక వృద్ధుడు నేడు చావు నోటి నుంచి తప్పించుకొని బయటపడ్డారు. థానేలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం నంబర్ 4 సమీపంలో మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. "రైల్వే ట్రాక్ లను దాటడం చట్టవిరుద్ధం, ప్రమాదకరం. కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోయే అవకాశం ఉండవచ్చు. ముంబై-వారణాసి స్పెషల్ రైలు 02193కు చెందిన ఎల్ పీఎస్ కె. ప్రధాన్, ఏఎల్ పీ రవిశంకర్ పైలెట్లు కళ్యాణ్ స్టేషన్ వద్ద ట్రాక్ దాటుతున్న సీనియర్ పౌరుడిని అత్యవసర బ్రేకులు వేసి కాపాడారు. సంతోష్ కుమార్ సీపీడబ్ల్యుఐ వారిని హెచ్చరించినట్లు" సెంట్రల్ రైల్వే తన ట్వీట్ లో పేర్కొంది.

కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో  ఫ్లాట్ ఫారం నంబర్ 4 సమీపంలో 70 ఏళ్ల హరి శంకర్ రైలు వస్తున్నప్పుడు పట్టాలు దాటుతుండగా ఆకస్మికంగా పడిపోయారు. అతను పడిపోవడం గమనించిన చీఫ్ పర్మనెంట్ వే ఇన్ స్పెక్టర్(సీపీడబ్ల్యుఐ) సంతోష్ కుమార్, డ్రైవర్లు లోకో పైలట్ ఎస్ కె ప్రధాన్, అసిస్టెంట్ లోకో పైలట్ జీ. రవిశంకర్ లను హెచ్చరిస్తూ పట్టాలపై దాటుతున్న వృద్ధుడికి తెలిసేలా హెచ్చరికలు చేయాలని అరిచారు. ఆ హెచ్చరికను కాదని వెంటనే ఇద్దరు లోకో పైలట్లు అత్యవసర బ్రేకులు వేసి వృద్ధుడిని కాపాడి తర్వాత రైలు కింద నుంచి అతనిని బయటకు తీశారు. ఇప్పడు ఈ వీడియొ సామాజిక మాధ్యమాలలో ట్రెండ్ అవుతుంది. సకాలంలో స్పందించి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఇద్దరు లోకోమోటివ్ పైలట్లు, సీపీడబ్ల్యుఐకి సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అలోక్ కన్సల్ ఒక్కొక్కరికి ₹2,000 నగదు బహుమతిని ప్రకటించారు.

మరిన్ని వార్తలు