Amazon: మౌత్‌వాష్‌ ఆర్డర్‌ చేస్తే.. ఖరీదైన ఫోన్‌

14 May, 2021 16:42 IST|Sakshi

ముంబై: సాధారణంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్‌ సైట్‌లలో అప్పుడప్పుడు మనం ఆర్డర్‌ చేసినవి కాకుండా వేరే ప్రొడక్ట్స్‌ రావడం చాలా సహజం.  అయితే తాము ఆర్డర్‌ చేసిన వస్తువు కన్నా ఎక్కువ ఖరీదైనది వస్తే.. రిటర్న్‌ చేసే వారు చాలా తక్కువ మంది. ఎక్కడో ఒకరో, ఇద్దరో మాత్రం వాటిని రిటర్న్‌ చేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అమెజాన్‌లో మౌత్‌వాష్‌ ఆర్డర్‌ చేస్తే.. అతడికి ఏకంగా రెడ్‌మీ నోట్‌ 10 ఫోన్‌ డెలివరీ వచ్చింది. దాంతో సదరు వ్యక్తి.. ఆ మొబైల్‌ని తిరిగి తీసుకోవాల్సిందిగా కోరుతూ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

ఆ వివరాలు.. ముంబైకి చెందిన లోకేష్‌ దగ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అమెజాన్‌లో మౌత్‌వాష్‌ ఆర్డర్‌ చేశాడు. అయితే అతడికి రెడ్‌మీ నోట్‌10 డెలవరీ చేశారు. మౌత్‌వాష్‌ ఆర్డర్‌ చేశాను కాబట్టి మొబైల్‌ని రిటర్న్‌ చేయడానికి కుదరడం లేదంటూ అతడు ట్వీట్‌ చేశాడు. ‘‘హలో అమెజాన్‌ నేను  # 406-9391383-4717957 కోల్గెట్‌ మౌత్‌వాష్‌ ఆర్డర్‌ చేశాను. దాని బదులుగా నాకు రెడ్‌మీ నోట్‌ 10 వచ్చింది. మౌత్‌వాష్‌ నిత్యవసర వస్తువు కాబట్టి యాప్‌లో రిటర్న్‌ పెట్టడానికి కుదరడం లేదు. నాకు వచ్చిన ప్యాకేజ్‌ మీద నా పేరే ఉంది. కానీ ఇన్‌వాయిస్‌ వేరేవారిది. నా దగ్గర నుంచి ఈ మొబైల్‌ తీసుకెళ్లి.. దాన్ని ఆర్డర్‌ చేసిన వారికి డెలవరీ చేయాల్సిందిగా నేను మీకు ఈమెయిల్‌ కూడా చేశాను’’ అంటూ ట్వీట్‌ చేశాడు.

మే 13న చేసిన ఈ ట్వీట్‌కి ఇప్పటికే అనేక రీట్వీట్‌లు వచ్చాయి. అతడి నిజాయతీపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.  

చదవండి: అమెజాన్‌లో హార్డ్‌ డిస్క్‌ ఆర్డర్‌.. పార్సిల్‌ విప్పగానే షాక్‌!‌

మరిన్ని వార్తలు