త్వరలో ముంబై కరోనా రహితం! 

4 Feb, 2021 14:00 IST|Sakshi

వైద్య నిపుణుల అభిప్రాయం 

సత్ఫలితాలనిచ్చిన బీఎంసీ చర్యలు 

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు 2020 మార్చి నుంచి బీఎంసీ చేస్తున్న పోరాటం, కృషి సత్ఫలితాలనిచ్చినట్లు తెలుస్తోంది. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టడంతో త్వరలో ముంబై కరోనా రహిత నగరంగా మారడం ఖయమని స్పష్టమవుతుంది. ప్రస్తుతం ముంబైలో కరోనా బాధితుల సంఖ్య 5,797 ఉన్నప్పటికీ అందులో 5,504 అంటే 95 శాతం మంది ఆరోగ్యం మెరుగ్గా ఉంది. అదేవిధంగా ఎమర్జెన్సీ ఉన్న 593 మంది రోగుల్లో 300 మందికి వ్యాధి తగ్గిపోయి ఈ సంఖ్య 293కు చేరింది. దీన్ని బట్టి త్వరలో ముంబై కరోనా రహిత నగరంగా మారే అవకాశముందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక రోజుకు ముంబై మహానగరంలో 500 లోపే కరోనా కేసులు వస్తున్నాయి. 

ధారావిలో కట్టడి.. 
2020 మార్చిలో కరోనా వైరస్‌ విస్తరించడం ప్రారంభం కాగానే చూస్తుండగానే ఆ వ్యాధి ముంబైని చుట్టుముట్టుంది. మురికివాడలు, ఇరుకు సందులు, రద్దీ కారణంగా కొద్ది రోజుల్లోనే అనేక ప్రాంతాలు కరోనాకు హాట్‌స్పాట్‌గా మారాయి. రోజురోజుకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వారిలో పాజిటివ్‌ వస్తున్న రోగుల సంఖ్య పెరిగిపోసాగింది. ఇలా రోజుకు 2,500పైగా పాజిటివ్‌ రోగులు నమోదు అవుతున్నారు. దీన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో ‘మాజే కుటుంబ్‌–మాజీ జబాబ్దారి’ (నా కుటుంబం–నాదే బాధ్యత) అనే పథకాన్ని ప్రారంభించారు. ఇందులో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరుగుతూ కరోనా వైరస్‌పై తీసుకోల్సిన జాగ్రత్తలు, జనజాగృతి, సేకరించిన స్వాబ్‌ నమూనాలు ల్యాబ్‌కు పంపించడం లాంటివి చేపట్టారు.

అదేవిధంగా ‘మిషన్‌ జీరో అభియాన్‌’ లో డాక్టర్లు నేరుగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చేపట్టిన ప్రత్యామ్నాయ మార్గాలు మంచి ఫలితాలనిచ్చాయి. దీంతో కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి రావడం మొదలైంది. ప్రారంభంలో సేకరించిన స్వాబ్‌ నమూనాలలో పాజిటీవ్‌ వచ్చే వారి శాతం 30–35 ఉండేది. ఇప్పుడు 4–6 శాతానికి పడిపోయింది. అయితే ముంబైలో ఇప్పటి వరకు 28,15,467 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 10.97 శాతమే పాజిటివ్‌ వచ్చింది.  ముంబైలో ప్రస్తుతం 5,797 కరోనా పాజిటివ్‌ రోగులున్నారు. అందులో 3,881 మందికి పాజిటివ్‌ ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు లేవు. అలాగే 1,623 మందికి స్వల్ప లక్షణాలు ఉన్నప్పటికీ వారి ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదు.  ముంబైలో ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు మొత్తం 3,08,969 కరోనా పాజిటివ్‌ రోగులున్నట్లు గుర్తించారు. అందులో 2,90,913 మంది కరోనాను జయించగా 11,351 మంది మృత్యువాత పడ్డారు.

మరిన్ని వార్తలు