నెటిజన్‌ ప్రశ్నకు ముంబై మేయర్‌ పరుష వ్యాఖ్యతో రిప్లై

3 Jun, 2021 12:07 IST|Sakshi
నెటిజన్‌ ప్రశ్నకు మేయర్‌ కిశోరీ ఫడ్నేకర్‌ రిప్లయ్‌

సాక్షి, ముంబై: వివాదాస్పద వ్యాఖ్యలతో ముంబై మేయర్‌ ఇరుకున పడ్డారు. ఓ టీవీ ప్రసారంపై సోషల్‌ మీడియా వేదికగా ఓ నెటిజన్‌ ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ పరుష వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. కాంట్రాక్ట్‌ ఎవరూ ఇచ్చారు? ఓ నెటిజన్‌ ప్రశ్నించగా మీ అయ్య? అంటూ ఆమె ట్విటర్‌లో తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్‌ అయ్యింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది.

ఓ వార్త ఛానల్‌ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి గ్లోబర్‌ టెండర్‌ విషయమై ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దానికి సంబంధించిన వివరాలను బుధవారం ఆ టీవీ ఛానల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. దీన్ని చూసిన మిఠి రివర్‌ అనే నెటిజన్‌ స్పందిస్తూ ‘కాంట్రాక్ట్‌ ఎవరు ఇచ్చారు?’ (మరాఠీలో ‘కాంట్రాక్ట్‌ కోనలా దియా’) అని ప్రశ్నిస్తూ కామెంట్‌ చేశాడు. దీన్ని చూసిన బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) మేయర్‌ కిశోరీ ఫడ్నేకర్‌ (శివసేన పార్టీ నాయకురాలు) స్పందిస్తూ ఘాటుగా బదులిచ్చారు. మీ నాన్న (మరాఠీలో ‘తుజ బాప్ల’) అని రిప్లయ్‌ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది. మేయర్‌ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. అయితే తప్పు తెలుసుకుని ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. కాకపోతే అప్పటికే పలువురు స్క్రీన్‌షాట్లు తీయడంతో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వ్యాఖ్యలపై వెంటనే ప్రతిపక్షాలు స్పందించాయి. ముంబై ప్రథమ పౌరురాలుగా ఉన్న ఆమె మాట్లాడే భాష ఏంటి? అని బీజేపీ కార్పొరేటర్‌ బాలాచంద్ర షిర్సత్‌ ప్రశ్నించారు. పౌరులతో మాట్లాడే తీరు ఇదేనా? అని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాయిస్‌ షేక్‌ తెలిపారు. మాట తీరు మార్చుకోవాలని హితవు పలికారు. వెంటనే అతడికి క్షమాపణలు చెప్పాలని నెటిజన్లతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కిశోర్‌ ఫడ్నేకర్‌ ముంబైలోని లోవర్‌ పరేల్‌ స్థానం మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2019లో ముంబై మేయర్‌గా ఎన్నికయ్యారు.

చదవండి: ఓటేయలేదుగా ఊరు విడిచి పోండి: ఓ నాయకుడి దౌర్జన్యం
చదవండి: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం

మరిన్ని వార్తలు