ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్‌ ట్విస్ట్‌..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా!

9 Jun, 2023 12:53 IST|Sakshi

ముంబైలో శ్రద్ధావాకర్‌ హత్యోదంతం తరహాలో జరిగిన మరో ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ మేరకు మహారాష్ట్రలోని థానేలో 56 ఏళ్ల మనోజ్‌ సానే అనే వ్యక్తి ప్రియురాలు సరస్వతి వైద్యను చంపి ముక్కలు చేసి, వాసన రాకుండా కుక్కరలో ఉడకబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నిందితుడి మనోజ్‌ సానేని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన దర్యాప్తులో బాధితురాలి సరస్వతి వైద్య గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఆమె అహ్మద్‌నరగ్‌లోని జాంకీబాయి ఆప్టే బాలికాశ్రమంలో పెరిగినట్లు తేలింది. ఆమె తన అంకుల్‌ ముంబైలో ఉంటారని అతనితోనే ఉంటానని చెప్పేదని​ ఆ బాలికాశ్రమంలో పనిచేసే మహిళ చెబుతోంది. సరస్వతి చివరిసారిగా రెండేళ్ల క్రితం అనాథశ్రమాన్ని సందర్శించిందని, అప్పుడు ఆమె చాలా సంతోషంగానే కనిపించిందని వెల్లడించింది. ఇక మనోజ్‌ సానే ఆమెను పెళ్లి చేసుకోలేదు. అతనికి ముంబైలోని బోరివాలిలో ఒక ఇల్లు ఉందని అక్కడ అతని కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ అతను తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.

మనోజ్‌ సాన్‌ బోరివలిలోని ఓ కిరాణ దుకాణంలో పనిచేసేవాడని, అక్కడకి సదరు బాధితురాలు తరుచు వచ్చేదని పోలీసులు పేర్కొన్నారు. 2014 నుంచి వీరి మధ్య స్నేహం మొదలైందని ఆ తర్వాత 2016 నుంచి మీరా రోడ్డులోని ఫ్లాట్‌కు తీసుకుని సహజీవనం ప్రారంభించినట్లు  వెల్లడించారు. చాలాకాలంగా కలిసే ఉంటున్నట్లు తెలిపారు. ఐతే గత కొద్ది రోజులుగా వీరి ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు గమనించి తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో తాము నిందితుడు మనోజ్‌సానే అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. 

విచారణలో నిందితుడు..ఆమె నాకు కూతురు లాంటిది!..
విచారణలో మనోజ్‌ సాన్‌ చెప్పిన విషయాలు విని పోలీసులు కంగుతిన్నారు. తాను హెచ్‌ఐవీ బాధితుడునని, చాలా ఏళ్ల క్రితమే ఈ వ్యాధి బారిన పడినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే బాధితురాలు సరస్వతితో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఆమె తనకు కూతురు లాంటిదంటూ షాకింగ్‌ విషయాన్ని చెప్పాడు. సరస్వతి పదోతరగతి పరీక్షలు రాయాలనుకుందని, ఇందుకోసం ఆమెకు గణిత పాఠాలు చెప్పేవాడనని తెలిపాడు.

ఐతే ఆమె తాను ఆలస్యంగా ఇంటికి వచ్చినా అనుమానించేదని చెప్పాడు. ఐతే జూన్‌ 3వ తేదిన తాను ఇంటికి వచ్చేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో తాను కేసులో ఇరుక్కుంటానేమోనన్న భయం వేసి ఇలా చేశానని వెల్లడించాడు. తాను ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్‌ హత్య గురించి తెలుసుకుని ఇలా చేసినట్లు పోలీసులకు వివరించాడు.

ఇదిలా ఉండగా, నిందితుడి ఇంటిలో లభించిన బాధితురాలి శరీర భాగాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, జూన్‌ 17 వరకు నిందితుడు తమ కస్టడిలోనే ఉంటాడని పోలీసులు వెల్లడించారు. 

--ఆర్‌ లక్ష్మీ లావణ్య, వెబ్‌ డెస్క్‌

(చదవండి: ముంబైలో నరరూప రాక్షసుడు..ప్రియురాలిని హతమార్చి.. ఆపై ‍కుక్కర్‌లో..)

మరిన్ని వార్తలు