జాగృతి వామన్‌ ఆలయాన్ని పునర్నిర్మిస్తాం

19 Jul, 2021 03:39 IST|Sakshi
తెలుగు సమాజ్‌ సేవా సంస్థ పదాధికారులు

ముంబైలోని తెలుగు సమాజ్‌ సేవా సంస్థ హామీ

పాక్షికంగా ధ్వంసమైన మందిరాన్ని సందర్శించిన సభ్యులు

సాక్షి, ముంబై: భారీ వర్షానికి దెబ్బతిన్న జాగృతి వామన్‌ మందిరాన్ని పునర్నిర్మిస్తామని తెలుగు సమాజ్‌ సేవా సంస్థ పదాధికారులు, సభ్యులు ప్రకటించారు. ముంబై నగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రభాదేవిలోని నాగుసయాజీ వాడిలో ఉన్న భారీ రావిచెట్టు నేలకూలడంతో చెట్టుపక్కనే ఉన్న ప్రముఖ ‘జాగృతి వామన్‌ మందిరం’ పాక్షికంగా దెబ్బతింది. సుమారు వందేళ్ల చరిత్రగల ఈ మందిరం తెలుగు వారికి ఎంతో ప్రసిద్ధి గాంచింది.

ఆలయం దెబ్బతిన్నట్లు తెలియగానే తెలుగు సమాజ్‌ సేవా సంస్థ పదాధికారులు, సభ్యులు ఆదివారం పరుగున వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మందిరంపై పడిన చెట్టు కొమ్మలు తొలగించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడే పటిష్టమైన మందిరాన్ని పునర్నిర్మించాలని సభ్యులందరు తీర్మానించారు. ఈ సేవా కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు చిట్టా ఆనంద్, కార్యదర్శి కట్కం గణేశ్, సభ్యులు అంబల్ల సంతోష్, పతర్లా కిషన్, యెల్ది సుదర్శన్, మేక గంగాధర్, కట్కం రాజన్న, రాపెల్లి రాజ్‌పాల్, స్థానిక మరాఠీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు