Mumbai: 50 శాతం మంది చిన్నారుల్లో యాంటీ బాడీలు: బీఎంసీ

28 Jun, 2021 20:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: మహారాష్ట్రలో డెల్లా ప్లస్‌ వేరియంట్‌ కేసుల పెరుగుదల, థర్డ్‌వేవ్‌తో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందన్న భయాల నేపథ్యంలో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) ఊరట కలిగించే వార్త చెప్పింది. దేశ ఆర్థిక రాజధానిలో నిర్వహించిన సేరో సర్వేలో 51 శాతానికిపైగా బాలబాలికల్లో కోవిడ్‌ యాంటీ బాడీలు ఉన్నట్లు తేలిందని వెల్లడించింది.

ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 15 వరకు సుమారు 2176 రక్త నమూనాలు పరీక్షించగా.. ఒకటి నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లల్లో 51.04 శాతం, 5-9 వయస్కుల్లో 47.55 శాతం, 10 నుంచి 14 ఏళ్ల చిన్నారుల్లో అత్యధికంగా 53.43 శాతం మంది, 15-18 ఏజ్‌ గ్రూప్‌లో 51.39 శాతం మందిలో వైరస్‌ ప్రతిరక్షకాలు కనుగొన్నట్లు తెలిపింది. మొత్తంగా 1- 18 ఏళ్ల వయసు గల పిల్లల్లో సెరో పాజిటివిటీ రేటు 51.18 శాతం ఉన్నట్లు బీఎంసీ నివేదిక పేర్కొంది.

ఇక ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే... సేరో పాజిటివిటీ రేటులో భారీ పెరుగుదల నమోదైనట్లు వెల్లడించింది. ‘‘18 కంటే తక్కువ వయస్సున్న పిల్లల్లో సెరో పాజిటివిటీ 39.4 శాతం ఉన్నట్లు గత సర్వేలో తేలింది. సెకండ్‌ వేవ్‌లో పిల్లలు ఎక్కువగా కోవిడ్‌ బారిన పడ్డారు. వారిలో ప్రతిరక్షకాలు పెరిగాయి’’ అని బీఎంసీ పేర్కొంది. కాగా డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్లు చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయంటూ భయాలు నెలకొన్న విషయ తెలిసిందే.

ఈ విషయంపై స్పందించిన ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా.. తొలి, రెండో దశలో పిల్లలకు కరోనా సోకినా పెద్దగా ప్రమాదం జరుగలేదని, చిన్నపాటి ఇన్‌ఫెక్షన్‌ మాత్రమే సోకిందని, కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం తప్పుతుందని పేర్కొన్నారు. ఇక అకాడమీ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌ సైతం.. ‘‘థర్డ్‌వేవ్‌లో పిల్లలు తీవ్ర లక్షణాలతో బాధపడతారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. 90 శాతం మంది స్వల్ప లక్షణాలతో బయటపడతారు’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.

చదవండి: థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు: జూలై 15 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు
Delta Variant: మళ్లీ కఠిన ఆంక్షలు 
పిల్లలపై... థర్డ్‌వేవ్‌ ప్రభావానికి ఆధారాల్లేవ్‌!

మరిన్ని వార్తలు