అసెంబ్లీ వేదికగా కంగనాపై పరోక్ష విమర్శలు

7 Sep, 2020 20:53 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత​ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో భాగంగా కంగనా రనౌత్‌ ముంబైని పీఓకేతో పోల్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పట్ల శివసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అసెంబ్లీ వేదికగా సోమవారం కంగన వ్యాఖ్యలపై స్పందించారు. జీవనోపాధి చూపించిన నగరం పట్ల కృతజ్ఞత లేదని పరోక్షంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొందరు తమకు జీవనోపాధి కల్పించిన నగరం పట్ల అమిత ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తారు. కానీ కొందరు అలా ఉండరు. అనిల్‌ భయ్యా(అనిల్‌ రాథోడ్‌)ని తీసుకొండి. ఆయన రాజస్తాన్‌ నుంచి వచ్చాడు. కానీ మహారాష్ట్రను తన ఇంటిగా మార్చుకున్నాడు. తను శివసేన వీరాభిమాని అన్నారు’ ఉద్ధవ్‌. (చదవండి: కంగనా క్షమాపణ చెప్పాలి: శివసేన)

ఇక ముంబైని పీవోకే అని వర్ణించడంతో కంగనా, శివసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో కంగనా తనకు రక్షణ కల్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరడంతో ఆమెకు వై ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించారు. దాంతో కంగనా అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలిపారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. మంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడకు రావొద్దని సంజయ్‌ రౌత్‌ కంగనాకు కౌంటర్‌ ఇచ్చారు. ఎంపీ సంజయ్‌ బహిరంగంగా తనకు వార్నింగ్‌ ఇస్తున్నారని, ఇప్పడు తనకు ముంబై పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తోందని కంగనా కామెంట్‌ చేయడంతో వివాదం మరింత ముదిరింది.

మరిన్ని వార్తలు