లాక్‌డౌన్‌లో లవర్‌ని ఎలా కలవాలి.. పోలీసుల ఫన్నీ రిప్లై

22 Apr, 2021 19:16 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర కోవిడ్‌ తాకిడికి కకావికలం అయ్యింది. బెడ్స్‌ లేక.. తగినంత ఆక్సిజన్ లభించక ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం ప్రభుత్వం నేటి నుంచి మే 1 వరకు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. పోలీసులు కేవలం అత్యవసర, నిత్యవసరాల కోసమే ప్రజలను బయటకు వదులుతున్నారు. పనిలేకుండా బయట తిరిగితే లాఠీలకు పని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ముంబై పోలీసులను ఓ వింత కోరిక కోరాడు.

‘‘నా లవర్‌ని మిస్ అవుతున్నాను. లాక్‌డౌన్‌ కాలంలో ఆమెను కలిసేందుకు బయటకు వెళ్లాలి అనుకుంటున్నాను. ఇందుకు నా వాహనం మీద ఏ రంగు స్టిక్కర్ వాడాలి?’’ అని ముంబై పోలీసులకు ట్వీట్ చేశాడు. దీనిపై కాప్స్‌ స్పందిస్తూ.. ‘‘మీకు ఇది ముఖ్యమైనదని మేం అర్థం చేసుకోగలం. కానీ, ఇది మా నిత్యవసర లేదా అత్యవసర జాబితాలో లేదు. దూరం బంధాలను మరింత బలపరుస్తుంది. ప్రస్తుతం మీరు ఆరోగ్యంగా ఉన్నారు. మీరు జీవితాంతం కలిసి ఉండాలని ఆశిస్తున్నాం. ఇది చాలా చిన్న అడ్డంకి. త్వరలోనే ముగుస్తుంది’’ అంటూ ట్వీట్‌ చేశారు.

ముంబై పోలీసులు ఇచ్చిన ఈ సమాధానానికి కొందరు నెటిజనుల హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ఇలాంటి పనికిమాలిని వాటికి వెంటనే రిప్లై ఇస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: సంపూర్ణ లాక్‌డౌన్‌.. రేపటి నుంచి 1 వరకు

మరిన్ని వార్తలు