60 వేల రెమిడెసివిర్‌ వయల్స్‌ విదేశాలకు..

19 Apr, 2021 06:05 IST|Sakshi

బ్రూక్‌ ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ను ప్రశ్నించిన ముంబై పోలీసులు

అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ

ముంబై: భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతుండడంతో రెమిడెసివిర్‌ టీకాకు డిమాండ్‌ అదేస్థాయిలో పెరుగుతోంది. కరోనా చికిత్సలో రెమిడెసివిర్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఈ టీకా కొరత వేధిస్తోంది. కొరత నేపథ్యంలో టీకా ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, డామన్‌కు చెందిన బ్రూక్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ 60,000 రెమిడెసివిర్‌ వయల్స్‌ను ఎయిర్‌ కార్గో ద్వారా విదేశాలకు తరలించినట్లు మంబై పోలీసులు గుర్తించారు.

ఆ సంస్థ డైరెక్టర్‌ రాజేశ్‌ డొకానియాను శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్లు అధికారులు వెల్లడించారు. విచారణ అనంతరం రాజేశ్‌ డొకానియా అర్ధరాత్రి ఇంటికి తిరిగి వెళ్లారు. బ్రూక్‌ ఫార్మా సంస్థ రెమిడెసివిర్‌ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. భారీ సంఖ్యలో వయల్స్‌ను విదేశాలకు అక్రమంగా తరలించినట్లు తేలడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బ్రూక్‌ ఫార్మా డైరెక్టర్‌ను పోలీసులు ప్రశ్నించడంపై మహారాష్ట్రలోని ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారిని అధికార శివసేన–కాంగ్రెస్‌–ఎన్సీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించింది.

రాజేశ్‌ డొకానియాను తరలించిన పోలీసు స్టేషన్‌కు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు బీజేపీ నేతలు చేరుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. బ్రూక్‌ ఫార్మా కంపెనీతో మాట్లాడి, మహారాష్ట్రకు రెమిడెసివిర్‌ టీకాలు ఇప్పించేందుకు తాము ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తోందని దేవేంద్ర ఫడ్నవీస్‌ విమర్శించారు. బ్రూక్‌ ఫార్మా సంస్థ యాజమాన్యాన్ని ప్రభుత్వం వేధిస్తోందని ధ్వజమెత్తారు. దేశానికి అత్యవసరమైన టీకాలను విదేశాలకు అక్రమంగా తరలించిన ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ను పోలీసులు విచారిస్తే బీజేపీకి అభ్యంతరం ఎందుకో చెప్పాలని కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ నిలదీశాయి.  రాజేశ్‌ డొకానియాను పోలీసులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు