‘అమ్మ.. మాస్క్‌ రెండూ కాపాడేవే’

20 Apr, 2021 22:26 IST|Sakshi

ముంబై: దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ చాపకిందనీరులా విస్తరిస్తూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వారాంతపు కర్ఫ్యూలు, కఠినమైన నిబంధనలను విధిస్తున్నాయి. కాగా కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడానికి, ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ముంబై పోలీసులు సోషల్‌ మీడియాలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు సోషల్‌ మీడియాలో మాస్క్‌కు ఉన్న ప్రాముఖ్యం తెలియజేస్తూ ఓ ఫొటో విడుదల చేశారు.

మాస్క్‌, అ‍మ్మను రెండింటి మధ్య పోలికలు ఏమిటో తెలుసా అంటూ ఒక చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. అమ్మ మనకు జన్మనించి నవమాసాలు మోసి, తన పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా చూస్తుంది. అలాగే ప్రతి ఒకరు విధిగా మాస్క్‌ ధరిస్తే అది కూడా మనల్ని కరోనా వైరస్‌ నుంచి కాపాడుతుందనే సందేశం ఆ ఫొటో ద్వారా తెలిపారు. కాగా ఆ ఫొటోలో ‘మా’ అనే హిందీ పదానికి ఎస్‌కే అక్షరాలను జోడించి మాస్క్ అని అర్ధం వచ్చేలా చేశారు. ఈ పోస్ట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముంబై పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి: కడుపులో బిడ్డను మోస్తూ... కర్తవ్యాన్ని మరువకుండా..!

మరిన్ని వార్తలు