పశ్చిమలో ఫేస్‌ రికగ్నిషన్‌ కెమెరాలు

30 Jul, 2021 03:42 IST|Sakshi

కేసులు త్వరితగతిన పరిష్కరించే యోచనలో పశ్చిమ రైల్వే నిర్ణయం 

రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు 

దాదర్‌: రైల్వేస్టేషన్‌లలో నేరాలను అరికట్టేందుకు ముఖాన్ని గుర్తించే ఆధునిక (ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం) సీసీటీవీ కెమెరాలు పశ్చిమ రైల్వే ఏర్పాటుచేస్తోంది. ప్రస్తుతం రద్దీగా ఉండే, నేరాలు ఎక్కువగా జరిగే స్టేషన్లలో ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఆ తరువాత దశల వారిగా మిగతా లోకల్‌ రైల్వే స్టేషన్‌లలో కూడా ఏర్పాటు చేయనుంది. ఇప్పటి వరకు మొత్తం 207 ఆధునిక కెమెరాలలో 242 కెమెరాలు రద్దీగా ఉండే వివిధ స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు పశ్చిమ రైల్వే భద్రత దళాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం రైల్వే పోలీసులు వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ప్రయోగం సఫలీకృతమైతే ముంబైతోపాటు ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో ఉన్న మిగతా రైల్వేస్టేషన్లలో కూడా ఏర్పాటు చేయనున్నారు.  

నేరాలు అరికట్టడానికి.. 
ముంబై లోకల్‌ రైల్వే పరిధి 120–135 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. లోకల్‌ రైళ్లతోపాటు ప్లాట్‌ఫారాలపై, పాదచారుల వంతెనలపై, సబ్‌ వేలో, ఎస్కలేటర్లపై విపరీతంగా రద్దీ ఉంటుంది. తోపులాటలు లేకుండా ప్లాట్‌ఫారంపై నుంచి బయట పడలేని పరిస్థితి ఉంటుంది. దీన్ని అదనుగా చేసుకుని చిల్లర దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తారు. జేబులోని డబ్బులు, పర్సులు కొట్టేయడం, మహిళ ప్రయాణికుల బ్యాగులు, మెడలోని బంగారు ఆభరణాలు చోరీకి గురైతుంటాయి. కొందరు దొంగలు ప్రయాణికులపై దాడిచేసి దోచుకుంటారు. స్థానిక స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైన తరువాత పోలీసులు దర్యాప్తుచేస్తారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ముంబైలో అదృశ్యమైన సంఘటనలు అనేక ఉన్నాయి. ఇందులో పిల్లలు, వృద్దులు, మహిళలు ఉన్నారు. వీటితోపాటు టికెటు బుకింగ్‌ కౌంటర్ల వద్ద దళారులను, ఈవ్‌టీజింగ్‌ చేసే ఆకతాయిల సంఖ్య అధికమైంది 

టెక్నాలజీ సహకారం.. 
కేసులు చేధించాలంటే పోలీసులు సీసీటీవీ పుటేజ్‌ల సాయం తప్పనిసరి తీసుకోవల్సి ఉంటుంది. కానీ, ప్లాట్‌ఫారాలపై, స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలపై దుమ్ము, ధూళి పేరుకుపోవడంతో స్పష్టంగా దృశ్యాలు కనిపించవు. అనేక చోట్ల కెమెరాల డైరెక్షన్‌ తప్పుడు దిశలో ఉంటాయి. దీంతో నేరాలు జరిగినప్పుడు దొంగలను, నేరస్తులను పట్టుకోవాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఫుటేజ్‌ల దృశ్యాలు స్పష్టంగా కనిపించడం లేదు. కేసు పరిష్కరించడంలో రైల్వే పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆ«ధునిక పరిజ్ఞానంతో తయారైన ఫేస్‌ రికగ్నేషన్‌ సిస్టం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పశ్చిమ రైల్వే నిర్ణయం తీసుకుంది. వీటివల్ల రాకపోకలు సాగించే సామాన్య ప్రయాణికులతోపాటు నేరస్తుల ముఖాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.  

దాదర్‌లో అడుగడుగునా కెమెరాలు.. 
నగరంలో నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా కనిపించే వివిధ వివిధ రైల్వే స్టేషన్లలో దాదర్‌ ఒకటి. దాదర్‌ స్టేషన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పశ్చిమ, సెంట్రల్‌ ఇలా రెండు రైల్వే మార్గాలు కలుస్తాయి. అంతేగాకుండా స్లో లోకల్‌ రైళ్లతోపాటు ఫాస్ట్‌ రైళ్లు కూడా నిలుస్తాయి. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే, పోయే ఎక్స్‌ప్రెస్, మెయిల్‌ రైళ్లు కూడా ఇక్కడ ఆగుతాయి. దీంతో నగరంలోని వివిధ రైల్వేస్టేషన్లతో పోలిస్తే దాదర్‌ స్టేషన్‌పై ప్రయాణికుల భారం ఎక్కువగా ఉంటుంది.

ప్లాట్‌ఫారం నంబరు ఒకటి ఆనుకుని హోల్‌సేల్‌ పూల మార్కెట్, కూత వేటు దూరంలో కూరగాయల మార్కెట్‌ ఉంది. దీంతో దాదర్‌ స్టేషన్‌ నుంచి నిత్యం ఐదు లక్షల మంది ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. దీన్ని బట్టి ఈ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థమవుతోంది. ప్రయాణికుల సంఖ్యతోపాటు నేరాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. దీంతో ఈ స్టేషన్‌ ఆవరణలో, ప్లాట్‌పారాలపై, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలపై, ఎస్కలేటర్ల వద్ద ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం సీసీటీవీ కెమెరాలు అడుగడుగున ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.     

మరిన్ని వార్తలు